‘బాహుబలి’ రెండు పార్ట్‌లతో తెలుగు భాషాచిత్రాలకు అంతర్జాతీయ కీర్తిని తెచ్చి, తెలుగు జెండాను వినువీధుల్లో రెపరెపలాడించిన దర్శకుడు రాజమౌళి. ఆయన తదుపరి చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ మొదలై రెండు నెలలకే ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇక గతంలో ‘బాహుబలి’ విడుదల తర్వాత ఆ చిత్రంతో పోటీ పడి, ‘బాహుబలి’ వంటి చిత్రం అని ప్రచారం జరిగిన ఏ చిత్రం కూడా వసూళ్లపరంగా ‘బాహుబలి’ దరిదాపుల్లోకి కూడా రాలేదు. ఈ కోవలోకి అమీర్‌ఖాన్, అమితాబ్, మోహన్‌లాల్, రజనీకాంత్, శంకర్ వంటి ఎందరో వచ్చి చేరుతారు.
ఇక విషయానికి వస్తే ప్రస్తుతం దేశంలో రూపొందుతున్న ఐదారు చిత్రాలలో ఏది ‘బాహుబలి’ రికార్డులను బద్దలు కొడుతుంది? అనే విషయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రాలు ఏవి అంటే,.. ‘కళంక్, బ్రహ్మాస్త్ర, ఆర్‌ఆర్‌ఆర్, మరక్కర్, భారతీయుడు 2’ అనేమాట వినిపిస్తోంది. వీటితో పాటు ‘సైరా.. నరసింహారెడ్డి, సాహో’ చిత్రాలను సైతం ఈ లిస్ట్‌లో చేర్చవచ్చు. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో అల్లూరి, కొమరంభీంలను స్ఫూర్తిగా తీసుకుంటే.. ‘సై..రా..నరసింహారెడ్డి’ తెలుగునాట తొలి స్వాతంత్య్రయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోంది. ఇక బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ చేస్తోన్న హాలీవుడ్ రేంజ్ యాక్షన్ థ్రిల్లర్ సాహోపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్నికల వల్ల భారతీయుడు 2 ఆగిందని, లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన వెంటనే వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలోపు కమల్ ఇందులో నటిస్తాడని తెలుస్తోంది.
ఇక అమితాబ్‌బచ్చన్, రణబీర్‌కపూర్, అలియాభట్, నాగార్జునలు ధర్మప్రొడక్షన్స్ బేనర్‌లో కరణ్‌జోహార్ నిర్దేశకత్వంలో నటిస్తున్న చిత్రం బ్రహ్మాస్త్ర. ఇక కరణ్‌జోహారే నిర్మాతగా రూపొందుతున్న చిత్రం కళంక్. ఇందులో సంజయ్‌దత్, మాధురీ దీక్షిత్, సోనాక్షి సిన్హా, అలియాభట్, వరుణ్‌ధావన్, ఆదిత్యారాయ్ కపూర్‌లు నటిస్తున్నారు. ఇక మోహన్‌లాల్, నాగార్జున, సునీల్‌శెట్టి, అర్జున్ సర్జా, సిద్దికి, ప్రభుదేవా, కిచ్చా సుదీప్‌లు కలిసి నటిస్తున్న మరో మల్టీస్టారర్ మరక్కర్ రూపొందుతోంది. ఈ చిత్రానికి ప్రియదర్శన్ డైరెక్టర్.
ఇక సైరా చిత్రంలో కూడా అమితాబ్, నయనతార, తమన్నా, కిచ్చాసుదీప్, విజయ్‌సేతుపతి, జగపతిబాబు వంటి పలువురు స్టార్స్ ఉన్నారు. మరి ఈ చిత్రాలలో ఏదైనా సరే బాహుబలిని బీట్ చేస్తుందా? అనే ఆసక్తి మొదలైంది. లేక రాజమౌళి బాహుబలి రికార్డును మరలా ఆయనే తన ఆర్‌ఆర్‌ఆర్‌తో తిరగరాస్తాడా? అనేది కూడా ఉత్కంఠను రేపుతోంది.