సినిమా షూటింగ్ ఇంకా 25శాతం కూడా పూర్తి కాకుండానే ‘బాహుబలి-ది బిగినింగ్, బాహుబలి-ది కన్‌క్లూజన్’ తర్వాత రాజమౌళి చేస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీపై ఏర్పడుతున్న అంచనాలు, ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్‌డేట్ వైరల్ అవుతున్న తీరు, దేశవ్యాప్తంగా సృస్టిస్తున్న ఉత్సుకత అంతా ఇంతా కాదు. ఇటీవలి కాలంలో ఇద్దరు పెద్దగా పేరు లేని హీరోల చిత్రాలను, లేదా ఒక సీనియర్, ఒక యంగ్‌మీరో కలిసి నటించిన చిత్రాలను కూడా మల్టీస్టారర్స్‌గా అభివర్ణిస్తున్నారు. కానీ ఇద్దరు ఒకే వయసు కలిగిన స్టార్స్, ఒకే స్థాయి ఇమేజ్ కలిసిగిన ‘జూనియర్ ఎన్టీఆర్-రామ్‌చరణ్’ల కాంబినేషన్‌లో రాజమౌళి తీస్తున్న అసలుసిసలు మల్టీస్టారర్ గురించి అందరు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ చిత్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రెస్‌మీట్ ద్వారా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్, దానయ్యలు బయటపెట్టారు.
ఈ చిత్రాన్ని 2020 జులై30న విడుదల చేయనున్నామని ప్రకటించారు. ‘మగధీర, బాహుబలి’లా ఈ చిత్రాన్ని కూడా మంచి సీజన్‌లోనే జక్కన్న విడుదల చేయనున్నాడు. పదేళ్ల కిందట జులై31నే మగధీర విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తానికి 14 నెలల తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్’ విడుదల కానుందనే వార్త అభిమానులకు అంతులేని సంతోషాన్ని కలిగిస్తోంది.
ఇక ఇందులో నటించే హీరోయిన్లపై కూడా క్లారిటీ వచ్చింది. రామ్‌చరణ్‌కి జోడీగా సీత పాత్రలో అలియాభట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ సరసన డైజీ అడ్గార్జియోన్స్ సందడి చేయనుంది. 1897లో బ్రిటిష్ వారి కంటి మీద కునుకు లేకుండా చేసిన అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో రామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తుండగా, 1901లో నైజాం పాలనకు వ్యతిరేకంగా బానిస సంకెళ్లను ఎదిరించిన కొమరం భీమ్ స్ఫూర్తి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించనున్నాడు. అయితే ఈ విషయంలో జక్కన్న చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. చారిత్రక కథగా కాకుండా ఆయా స్వాతంత్య్రవీరుల పాత్రల స్ఫూర్తితో, కల్పిత గాధగా దీనిని తెరకెక్కిస్తున్నాడు. అదే పాత్రలతో అంటే చరిత్రలో ఉన్నది ఉన్నట్లు చూపించాలి కానీ దానికి స్ఫూర్తి అంటే కల్పిత గాధతో ఫాంటసీకి చోటు కల్పించవచ్చు.
ఈ చిత్రంలో వర్తమానం ఉండదని, ఈ ఇద్దరిని 1920లో బ్రిటిష్ వారిపై యుద్దం చేసిన వీరులుగానే చూపించనున్నాడు. మామూలు హీరోలనే సూపర్ హీరోలుగా చూపించే తాను.. మన దేశానికి సేవ చేసిన దేశభక్తులను ఏ రేంజ్‌లో చూపిస్తానో మీరే ఊహించుకోండి అని చెప్పిన రాజమౌళి ఒక్కసారిగా ఈ చిత్రం అంచనాలను పెంచి వేశాడు. ఇక అజయ్‌దేవగణ్ పాత్ర విలన్ కాదని, ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే కీలకమైన పవర్‌ఫుల్ పాత్రని జక్కన్న చెప్పాడు. మొత్తానికి అజయ్‌దేవగణ్, అలియాభట్‌ల ద్వారా ఈ చిత్రం బాలీవుడ్‌లో కూడా సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతుంది.
ఇక మరో పాత్రలో తమిళ నటుడు కమ్ డైరెక్టర్ సముద్రఖని నటిస్తున్నారనే విషయంపై క్లారిటీ వచ్చింది. అయితే అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లు చరిత్రలో కలవలేదని, కానీ వారి స్ఫూర్తితో రూపొందిస్తున్న ఈ పాత్రలు ఈ చిత్రంలో కలిసేలా తయారు చేసుకున్నారు. చరిత్రలో కలవని వీరిద్దరు ఆర్‌ఆర్‌ఆర్‌లో కలవడం ద్వారా జక్కన్న తన స్టైల్ ఆఫ్ హిస్టారికల్ ఫిక్షన్‌కి తెరతీస్తున్నాడు. ఇక ‘మోటార్ సైకిల్ డైరీస్’ అనే చిత్రంలోని చెగువేరా పాత్ర తాలూకు చిత్రణ తనకి ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలిపిన రాజమౌళి ఇందులో చరణ్ పాత్రకి అలాంటి ట్రీట్‌మెంట్ ఇచ్చే ఉద్దేశ్యం ఉందని చెప్పాడు చరణ్ బాబాయ్ పవన్‌కి చెగువేరా అంటే ప్రాణం అన్న సంగతి తెలిసిందే.
ఇక బాహుబలి కథ చాలా పెద్దదని, అందుకే రెండు భాగాలు తీశానని, అంతేగానీ మొదటి పార్ట్ హిట్ అయింది కదా అని రెండోపార్ట్‌ని తీయలేదని స్పష్టం చేశాడు. ఆర్‌ఆర్‌ఆర్‌కి అంత స్పాన్ లేదని, కాబట్టి ఆర్‌ఆర్‌ఆర్ ఒకే పార్ట్‌గా ఉంటుంది గానీ దీనికి సీక్వెల్ ఉండదని తేల్చాడు. ఇక ఇద్దరు స్టార్స్ అంటే ఒకరికి ఒక ఫైట్ ఉంటే రెండో వారికి కూడా మరో ఫైట్ ఉండాలని, ఒకరికి ఓ పాట ఉంటే మరోకరికి కూడా మరో పాట ఉండాలి అనే విధంగా తాను ఈచిత్రం తీయడం లేదని, దానివల్ల కథలో రసం మిస్ అవుతుంది. కథ ప్రధాన ఉద్దేశ్యం దెబ్బతింటుంది. నేను అలా చేయబోవడం లేదు. ఆ సినిమాలో ప్రేక్షకులంతా ఎన్టీఆర్, చరణ్‌లను కాకుండా ఒక రామరాజు-కొమరం భీమ్‌లని చూసేలా కథలో ఇన్‌వాల్వ్ అయ్యేలా చేస్తాను.
సినిమా ప్రారంభమైన పది నిమిషాలలోనే కథలో విలీనం అయి పాత్రలతో ప్రేక్షకులు ట్రావెల్ అయ్యేలా ఈ చిత్రం ఉంటుంది. ‘కుక్క తోక వంకర’లా నా శైలి ఉంటోంది. ‘ఈగ, బాహుబలి’ తర్వాత గ్రాఫిక్స్ చిత్రం చేయకూడదని అనుకున్నాను. కానీ ఈ చిత్రంలో కూడా గ్రాఫిక్స్ ఉంటాయి. ఇందులో కేవలం సహజత్వం కోసమే గ్రాఫిక్స్‌ని వినియోగిస్తున్నాం. 1920 నాటి కాలాన్ని సహజంగా చూపించాలంటే గ్రాఫిక్స్ అవసరం ఎంతైనా ఉంటుంది. అల్లూరి నడయాడిన అడవి, నాటి అడవి ప్రాంతాన్ని, కొమరం భీం నడయాడిన గిరిజన తండాలను సహజత్వంతో చూపించడానికే ఈ విఎఫ్‌ఎక్స్, గ్రాఫిక్స్ ఉంటాయని చెప్పాలి.
ఇక వాస్తవానికి అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ల జీవితాలు ఆత్మత్యాగాలతో ముగుస్తాయి. మరి ఇందులో జక్కన్న ఆయా స్ఫూర్తి పాత్రల ఎండ్ కార్డ్‌ని ఎలా చూపిస్తాడో చూడాలి? ఇక గతంలో తెలంగాణ ఉద్యమం ఉదృతంగా ఉన్నప్పుడు పవన్‌కళ్యాణ్ తన చిత్రానికి ‘కొమరం పులి’ అని టైటిల్ పెడితే తెలంగాణ వాదులు మండిపడ్డారు. దాంతో చివరకు ఆ టైటిల్‌నుంచి కొమరం అనే పేరును తీసివేశారు. మరి ఇందులో ఎన్టీఆర్ పాత్ర పేరు కొమరం భీమ్ కావడంతో మరలా తెలంగాణ వారు మండిపడతారా? నాటి వేడి నేడు లేదు.. ప్రత్యేక తెలంగాణ కూడా వచ్చేసింది కాబట్టి మౌనంగా ఉంటారా? అనేది వేచిచూడాల్సివుంది...!