జనసేనాని పవన్‌కళ్యాణ్ దూకుడు పెంచుతున్నాడు. ఆయన వామపక్షాలతో కలిసి పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నాడు. అయితే జనసేన బలంగా ఉన్న స్థానాలలో కామ్రేడ్లు కోరడం ఆయనకు మింగుడుపడటం లేదు. నేడు జనసేన ఆవిర్భావ సభను రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నారు. ఆ వెంటనే రోజుకి రెండు మూడు మీటింగ్‌లు, కనీసం 100 నియోజకవర్గాల్లో ప్రచారం చేసే నిమిత్తం ఆయన హెలికాప్టర్‌ని రెడీ చేస్తున్నాడు. మరోవైపు చాలాకాలం కిందటే జనసేనాని తాను రాయలసీమ నుంచి మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని, కరువు సీమ అనంతపురం జిల్లాను దత్తత తీసుకుంటానని చెప్పాడు.
తాజాగా ఆయన దరఖాస్తు చేసుకునే సమయంలో మాత్రం పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తానని తెలిపాడు. తాజాగా ఈయన విశాఖ పరిధిలోని గాజువాక నుంచి పోటీ చేస్తాడనే ప్రచారం సాగుతోంది. ఇది జనసేనకి ఎంతో కీలకమైన సీటు కావడం, జనసేనకి ఇక్కడ మంచి పట్టు ఉందనే వార్తల మధ్య గాజువాక పేరు ప్రచారంలోకి వచ్చింది.
ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి చివరి స్పీకర్‌గా పనిచేసి, రెండు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన నాదెండ్ల మనోహర్ జనసేనానికి అన్ని విషయాలలో తోడు నీడగా ఉంటున్నాడు. అదే సమయంలో మనోహర్ తండ్రి, ఎన్టీఆర్ ఎపిసోడ్‌లో సమైకాంధ్రకి నెలరోజుల ముఖ్యమంత్రి అయిన నాదెండ్ల భాస్కర్‌రావు బిజెపిలో చేరనున్నాడని ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో నాదెండ్ల ఇప్పటికే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్‌తో చర్చలు పూర్తి చేశాడని అంటున్నారు. అంటే కొడుకు జనసేన. తండ్రి బిజెపి అన్నమాట..!