తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తనయుడు నారాలోకేష్ ఎమ్మెల్సీగా ఉండి దొడ్డిదారిన మంత్రి అయ్యాడనే అపవాదు ఉంది. గతంలో పవన్‌తో సహా పలువురు పంచాయతీ ఎన్నికల్లో కూడా గెలవలేని వ్యక్తికి మంత్రి పదవా? అని నారాలోకేష్‌ని విమర్శించారు. దీంతో ఈసారి ఎలాగైనా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి తన సత్తా నిరూపించుకోవాలని ఆయన భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే సేఫ్టీ ప్లేస్‌గా భీమిలి, విశాఖ నార్త్, వెస్ట్ వంటివి తెరపైకి వచ్చాయి. కానీ చివరకు లోకేష్‌కి రాజధాని అమరావతిలో భాగమైన గుంటూరు జిల్లా మంగళగిరి టిక్కెట్‌ని కేటాయించారు. ఈ నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీ చేయడం వెనుక ఎంతో మతలబు ఉందని అంటున్నారు. రాష్ట్రంలో మరలా టిడిపి గెలిచి అధికారంలోకి వస్తే ఫర్వాలేదు. తేడా వచ్చి ఓడిపోయినా మంగళగిరి నుంచి లోకేష్ గెలిస్తే ఖరీదైన, రాజధాని ప్రాంతం కావడంతో అక్కడ చేసే ప్రతి నిర్మాణంలోనూ ప్రోటోకాల్‌లో భాగంగా లోకేష్ పేరు ఖచ్చితంగా ఉంటుంది.
ఇక లోకేష్‌పై జూనియర్ ఎన్టీఆర్ మామయ్య నార్నే శ్రీనివాసరావుని వైసీపీ తరపున పోటీ చేయించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఇక ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడా మంచి పట్టే ఉంది. మరోవైపు ప్రతి విషయంలోనూ తనని తాను తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్‌తో పోల్చుకునే లోకేష్ ఈసారి మంగళగిరి ఎన్నికల్లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేటీఆర్ సాధించిన విజయం కంటే భారీ విజయం దక్కించుకోవాలని భావిస్తున్నాడు. అసలు మొదట లోకేష్‌ని వైజాగ్ నుంచి పరిశీలించారు.
కానీ హఠాత్తుగా మంగళగిరి పేరు బయటకు రావడానికి కారణం బాలయ్య మొండితనమే అని కూడా ప్రచారం సాగుతోంది. ఈ సారి ఎన్నికల్లో తన ఇద్దరు అల్లుళ్లయిన నారా లోకేష్, భరత్ ఇద్దరినీ పోటీకి దింపాలని బాలయ్య పట్టుదలగా ఉన్నాడు. భరత్‌కి విశాఖ నుంచి ఎంపీగా అవకాశం లభించే చాన్స్ ఉంది. అదే సమయంలో లోకేష్ కూడా అక్కడి నుంచే పోటీ చేస్తే విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అందుకే చివరకు లోకేష్‌ని మంగళగిరి నుంచి పోటీకి దింపారని సమాచారం. మరి లోకేష్ కేటీఆర్ కంటే ఎక్కువ మెజార్టీతో ఈ స్థానం నుంచి గెలుస్తాడా? లేదా? అన్నది వేచిచూడాల్సివుంది..!