రాజకీయ నాయకులకు పలు అంశాలపై అవగాహన, ప్రసంగించే సామర్ధ్యం ఉండాలి. వెంకయ్యనాయుడు వంటి వారు గతంలో కేవలం తమ వాగ్దాటితో రాజకీయాలలో ఎదిగి, ఉన్నత స్థానాలను సాధించుకున్న వారే. కానీ నేటి రాజకీయ నాయకులకు కేవలం డబ్బు తప్ప మరో ద్యాస లేదు. కేవలం అర్ధబలంతో గెలవాలనే తపన తప్ప తమ ప్రసంగాల తీరును మెరుగుపరిచే విధానం తెలియడం లేదు.
ఇక విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీలో అనర్ఘళంగా మాట్లాడగలిగిన స్ఫురద్రూపి స్వర్గీయ ఎన్టీఆర్. ఆయన ప్రసంగాలు జనాలను ఉర్రూతలూగించేవి. నాడు ఎన్టీఆర్‌తో పాటు నల్లపు రెడ్డి శ్రీనివాసులురెడ్ది వంటి మంచి ప్రసంగీకులు టిడిపిలో ఉండేవారు. ఇక వ్యక్తిగత క్రేజ్‌ని పక్కనపెడితే ప్రస్తుత టీడీపీలో పట్టుమని పదినిమిషాలు అనర్ఘళంగా మాట్లాడే వారే కరువయ్యారు. ఈ విషయంలో పాపం చంద్రబాబు అన్ని తానై వ్యవహరిస్తున్నాడు. నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే నాయకులు ఉండేవారు. కానీ టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినా వాటిని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లేవారే కరువయ్యారు. దాంతో బాబు చేసిన మంచి పనులకు కనీస ప్రచారం కూడా లేదు. ఏ పథకం ‘ఆరోగ్యశ్రీ, 108’ తరహాలో ప్రజల్లోకి గట్టిగా వెళ్లడం లేదు.
ఇక చంద్రబాబు కుమారుడు లోకేష్ ప్రసంగ నైపుణ్యం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక బాబు బావమరిది, వియ్యంకుడు బాలకృష్ణ సినిమాలలో డైలాగ్స్‌ని బాగా చెబుతాడే గానీ ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారాలలో ఆయన ప్రసంగాలు అర్ధం కాక జనాలు బద్దలు కొట్టుకుంటూ ఉంటారు. ఇక అభిమానులపై చేయి చేసుకోవడం వంటి వాటివల్ల బాలయ్యని స్టార్ కాంపేయిన్‌గా వాడుకుంటే మంచి కంటే చెడే ఎక్కువ అవుతుందనే విమర్శలు వస్తూ ఉంటాయి. ఈ విషయం నంద్యాల ఎన్నికల ప్రచారం నుంచి పలు చోట్ల నిరూపితం అయింది. ఇక నందమూరి వంశంలో మంచి వాక్చాతుర్యం కలిగిన దిట్ట జూనియర్ ఎన్టీఆరే. గతంలో ఆయన టిడిపికి ప్రచారం చేసిన సీట్లలో టిడిపిని గెలిపించలేకపోయి ఉండవచ్చు గానీ నాడు వైఎస్, చంద్రబాబు, చిరంజీవి వంటి యోధానుయోధులు ఉన్నారు.
ఇక ఈసారి ఎన్నికల్లో తమ తమ నియోజకవర్గాల్లో జూనియర్‌ని ప్రచారానికి ఒప్పించమని టిడిపి శ్రేణులు బాబుపై ఒత్తిడి తెస్తున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. చివరకు తన తాతయ్య బయోపిక్‌లపై కూడా మౌనమే వహించాడు. ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపధ్యంలో ఇటు పవన్ కూడా లేని లోటుని చంద్రబాబు ఎలాగైనా జూనియర్ చేత భర్తీ చేయించగలడా? లేదా? అనేదే ఆసక్తికరంగా మారింది. స్వయాన తన సోదరి సుహాసిని తెలంగాణ ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి పోటీ చేసినా ఎన్టీఆర్ నామమాత్రంగా స్పందించాడే గానీ ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లని సంగతి గమనార్హం.