చంద్రబాబునాయుడు, నందమూరి ఫ్యామిలీలను విలన్లుగా చూపిస్తూ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో చిత్రం తీస్తున్న సంగతి తెలిసిందే. మార్చి22న ఈ చిత్రాన్ని విడుదల చేస్తానని వర్మ ప్రకటించాడు. తన సినిమాని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోనని, డిజిటల్ ఫార్మాట్‌లోనైనా విడుదల చేసి తీరుతానని వర్మ గట్టి పట్టుదలతో ఉన్నాడు. మరోవైపు లక్ష్మీపార్వతి వంటి వారు దాదాపు 20ఏళ్ల తర్వాత వర్మ ఎన్టీఆర్ జీవితంలోని నిజాలను వెలికి తీస్తున్నారని వర్మకి మద్దతు ఇస్తున్నారు. ఇక సామాన్య ప్రేక్షకులతో పాటు వైసీపీ నేతలకు ఈ చిత్రం విడుదలైతే తమ ఎన్నికలకు బాగా ఉపయోగపడే వీలుందని ఆశతో ఉన్నారు.
ఇక విషయానికి వస్తే ఇప్పటికే ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడుని విలన్‌గా చూపిస్తున్నట్లు ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్లు, ట్రైలర్లు తేల్చేసాయి. ఇప్పుడు ఈ చిత్రానికి సెన్సార్ ఇవ్వడమా? లేదా? అని సెన్సార్ వారే తల బద్దలు కొట్టుకుంటున్నారు. ఈ నేపధ్యంలో వారు ఎలక్షన్ కమిషన్‌కి దీనిని రిఫర్ చేశారని సమాచారం. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈ చిత్రం విడుదలపై సందేహాలు వస్తున్నాయి. ఎన్నికల వేళ ఈ చిత్రం విషయంలో ఈసీ చేతులు ముడుచుకుని ఉండదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ఈ సమయంలో ఇలాంటి చిత్రాలపై చర్యలు తప్పవంటూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరును ఎత్తకుండానే తెలంగాణ ఎన్నికల కమిషన్ అధికారి రజత్‌కుమార్ కుండబద్దలు కొట్టాడు.
మీడియాలో, సోషల్‌మీడియాలో వచ్చే కథనాలపై ఓ కన్ను వేసి ఉంచుతామని, ఎన్నికలపై ప్రభావం చూపించే చిత్రాలపై కూడా కఠిన ఆంక్షలు తప్పవని రజత్ కుమార్ బాంబు పేల్చాడు. అయితే ఇప్పటి వరకు తమకు ఏ ఒక్క చిత్రంపై ఫిర్యాదు రాలేదని చెప్పుకొచ్చాడు. అయితే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై ఫిర్యాదు ఏకంగా కేంద్ర ఎన్నికల కమిషన్ వద్దకు చేరడం విశేషం. దేవిబాబు అనే వ్యక్తి ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లగా, కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ ఫిర్యాదును పరిశీలించాలని ఏపీ ఎన్నికల అధికారి ద్వివేదికి సూచించిందని సమాచారం. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మార్చి22న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల ఉంటుందా? లేదా? అనేది మాత్రం సస్పెన్స్‌గా మారింది.