ఒకే ఒక్క ప్రెస్ మీట్ ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు.. అన్నట్టుగా.. రాజమౌళి నేడు RRR ప్రెస్ మీట్ లో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ప్రోగ్రాం స్టార్ట్ చేసాడు. తన హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, నిర్మాత దానయ్య తో కలిసి తాను భారీగా తెరకెక్కిస్తున్న RRR ప్రెస్ మీట్ ని మొదలు పెట్టాడు. గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ గా ఉన్న RRR ప్రెస్ మీట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా మొదలైంది. ఈ ప్రెస్ మీట్ లో రాజమౌళి RRR విడుదల డేట్ పై... RRR కథపై, అలాగే సినిమాలో నటిస్తున్న నటీనటుల వివరాలు మీడియాకి వివరిస్తున్నాడు.
మొదటగా RRR వచ్చే ఏడాది అంటే 2020 వ సంవత్సరం.. జూలై 30 న విడుదలవుతుందని.. అలాగే RRR కథకు మూలం..1920 కాలంలో ఉత్తరభారతంలో జరిగిన కథ అని చెప్పిన రాజమౌళి.. RRR లో ఎన్టీఆర్ కొమరం భీమ్ గాను, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నారని వారి పాత్రలను రివీల్ చేసాడు. అయితే అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లు యుక్తవయసులో కనబడకుండా పోయి.. మల్లి కొన్నాళ్ళకు పరిపక్వత కలిగిన వ్యక్తులుగా తిరిగొచ్చాక.. ప్రజల కోసం ఉద్యమాలు చేశారు. అయితే కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాల్లో చాలా సారూప్యతలు ఉన్నాయని... వారు యుక్తవయసులో మాయావకుండా ఉంటే.. వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో.. ఆ ఆలోచనలు కలిసి పంచుకుంటే... ఒకరివలన ఒకరు ఎలా ప్రభావితం అవుతారో అనే ఆలోచనతోనే ఈ RRR కథ పుట్టిందని.. రాజమౌళి చెప్పాడు.
ఇక ఎప్పుడూ కథను ముందుగానే రివీల్ చేసి.... సినిమా మొదలు పెట్టే నేను.. ఈసారి కథ ని చెప్పడానికి కొంచెం టైం తీసుకున్నానని... అయితే కథ చెప్పకుండా లేట్ చేయడం వెనుక సరైన కారణమే ఉందని అన్నాడు రాజమౌళి. సినిమా కథను ముందే చెప్పడం తనకు ఇష్టం లేకపోయిందని చెప్పిన రాజమౌళి.. ఈ RRR ప్రెస్ మీట్ లో కథను రివీల్ చేసాడు.