గత ఎన్నికల్లో జగన్ తల్లి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి శ్రీమతి విజయమ్మ వైజాగ్ ఎంపీ సీటు నుంచి పోటీ చేసి టిడిపి-బిజెపిల ఉమ్మడి అభ్యర్థి, నాటి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. కానీ రాబోయే ఎన్నికల్లో తన తల్లిని మరోసారి పోటీ చేయించేందుకు జగన్ సిద్దంగా లేరు. ఈసారి ఆయన తన సోదరి షర్మిలాను ఎన్నికల బరిలో దింపాలనే యోచనలో ఉన్నాడు. ఇప్పటికే జగన్ ఒంగోలు ఎంపీ, తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి సీటు ఇవ్వడానికి నిరాకరించాడు. దాంతో ఈసారి షర్మిలా ఒంగోలు ఎంపీగా గానీ, లేదా వైజాగ్ ఎంపీగా గానీ పోటీ చేస్తుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఆమె నిలబడే సీటు విషయంలో మరో వార్త హల్‌చల్ చేస్తోంది.
కర్నూల్ సీనియర్ నాయకుడు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి టిడిపి కండువా కప్పుకున్నాడు. ఈయన తండ్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి సమైక్యాంధ్రకి ముఖ్యమంత్రిగా చేయడమే కాదు.. కర్నూల్ నుంచి ఎన్నోసార్లు పోటీ చేశాడు. ఆయన కుమారుడు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి మాత్రం తన రాజకీయ జీవితం మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉంటూ కేంద్రమంత్రిగా కూడా పనిచేశాడు. గత ఎన్నికల్లో ఆయనతో పాటు టిడిపిని కూడా వైసీపీ నాయకురాలు బుట్టా రేణుక ఓడించింది. అయినా రాష్ట్రంలో మరలా కాంగ్రెస్ పుంచుకుంటుందనే ఉద్దేశ్యంతో ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నాడు. కానీ కాంగ్రెస్ ఇంకా పుంజుకునే అవకాశం లేకపోవడంతో కర్నూల్ ఎంపీ సీటు హామీ పొందిన తర్వాతే కోట్ల టిడిపి కండువా కప్పుకున్నాడట.
కర్నూల్‌లో ఈయన బలమైన అభ్యర్థి. తనకంటూ ఫాలోయింగ్, కాంగ్రెస్ సానుభూతి పరుల ఓట్లు, టిడిపి ఓట్లు.. ఇలా ఆయన ఈసారి తన సత్తా చాటాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో కోట్లకు ధీటైన వ్యక్తి కోసం జగన్ ఎందరి పేర్లనో పరిశీలించాడు. దాంతో షర్మిలాని అక్కడి నుంచి కోట్లకు వ్యతిరేకంగా పోటీ చేయిస్తే విజయం సాధ్యమని జగన్ ఆలోచించాడట. దానికి ఆయన అనుచరులు కూడా మద్దతు పలకడంతో జగన్ ఈ విషయంలో స్పష్టంగా ఉన్నాడని తెలుస్తోంది. అదే జరిగితే ఈ సారి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి గెలుపు అంత సులభం కాదనే చెప్పాలి.