పెద్ద పెద్ద స్టార్స్ చిత్రాల రిలీజ్ డేట్స్‌లో తేడాలు వచ్చాయంటే అభిమానులు బాగా ఫీలవుతారు. చెప్పిన తేదీకి రాకుండా పదే పదే వాయిదాలు పడే చిత్రాలకు నెగటివ్ టాక్ వస్తుందనే సెంటిమెంట్ ఎప్పటినుంచో ఉంది. అన్ని చిత్రాలు అని చెప్పలేం గానీ కొన్ని చిత్రాల విషయంలో ఈ సెంటిమెంట్ నిజమేనని నిరూపించింది. ప్రస్తుతం మహేష్‌బాబు అభిమానులు అదే బాధలో ఉన్నారు. ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 25కి, తాజాగా మే 9వ తేదీకి ‘మహర్షి’ చిత్రం మూడు సార్లు విడుదల వాయిదా పడింది.
మరోవైపు దిల్‌రాజు ఆ డేట్‌కి జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి వంటి సెంటిమెంట్స్‌ను చెబుతున్నాడు. అయినా మహేష్‌కి మే నెల అచ్చిరాలేదనేది వాస్తవం. ఈ విధంగా ఫ్యాన్స్‌లో అయోమయం, ఒత్తిడి, టెన్షన్ ఏర్పడ్డాయి. ఇలా ఉన్న మహేష్ అభిమానుల కోసం యూనిట్ తాజాగా ఈ చిత్రం వర్కింగ్ స్టిల్స్‌ని విడుదల చేసింది. వాటిని చూసైనా అభిమానులు కాస్త సంతోష పడతారనేది దానికి కారణమనే చెప్పాలి. ఈ స్టిల్స్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీని బదులుగా ఏదైనా టీజర్‌ని గానీ, పోస్టర్‌ని గానీ విడుదల చేసి ఉంటే బాగుండేదనే మాటలు కూడా వినవస్తున్నాయి.
మొత్తానికి మహేష్‌బాబు ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు, అశ్వనీదత్, పివిపి సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న ‘మహర్షి’ చిత్రంపై అంచనాలు ఏమాత్రం తగ్గకుండా యూనిట్ నానా తంటాలు పడుతోంది. విడుదలకు ఇంకా రెండు నెలల సమయం ఉండటంతో మెల్లమెల్లగా పోస్టర్స్, టీజర్స్, మేకింగ్ వీడియోలు, ట్రైలర్స్‌తో అభిమానులలో జోష్ నింపేందుకు మహర్షి టీం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోందనేది వాస్తవం. ఇకపోతే దీనితర్వాత మహేష్, అనిల్‌రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ రెండింటితో పాటు మరో ఇద్దరు దర్శకులకు కూడా మహేష్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు వస్తున్నాయి.