ఒకప్పుడు దక్షిణాది దిగ్గజ దర్శకుడు అంటే అందరు శంకర్ పేరే చెప్పేవారు. కానీ రాజమౌళి తన బాహుబలితో ఆయన్ని తోసి రాజన్నాడు. రాజమౌళి కూడా భారీ బడ్జెట్‌తో, సాంకేతిక హంగులతోనే చిత్రాలు తీస్తాడు. కానీ అవి సహేతుకంగా ఉంటాయి. కాస్త అటు ఇటు అయినా పెట్టిన బడ్జెట్‌కి తగ్గ లాభాలను చూపించడంలో, సినిమాని పూర్తి చేసి విడుదల చేయడంలో శంకర్ కంటే రాజమౌళినే గ్రేట్ అని చెప్పాలి.
ఇక విషయానికి వస్తే శంకర్ అంటే భారీతనానికి కేరాఫ్ అడ్రస్. ఇక ఇవి ఎప్పుడు మొదలవుతాయో... ఎప్పుడు విడుదల అవుతాయో కూడా చెప్పలేం. అనుకున్న బడ్జెట్‌కి అటు ఇటు కాకుండా రెండుమూడ్లు రెట్లు ఎక్కువ పెట్టిస్తాడనే విమర్శ ఉంది. దీనివల్లనే ఐ, 2.ఓ చిత్రాలు భారీ కాస్ట్‌ఫెయిల్యూర్స్ అయ్యాయి. ఇక శంకర్‌తో సినిమా అంటే మామూలు దర్శకులు తట్టుకోలేరు. భారతీయుడు సీక్వెల్‌కి ముందుగా దిల్‌రాజు ముందుకు వచ్చినా ఆ తర్వాత తత్వం బోధపడి వదిలేసుకున్నాడు. ఇక శంకర్ కూడా తన చిత్రాలకు భారీ నిర్మాతలనే ఎంచుకుంటూ ఉంటాడు. కానీ అంతటి భారీ నిర్మాతలకు కూడా ఆయన చుక్కలు చూపిస్తూ ఉంటాడనేది నిజమే.
ఇక ప్రస్తుతం కమల్‌హాసన్ భారతీయుడు సీక్వెల్‌ని లైకా ప్రొడక్షన్స్ సంస్థే నిర్మిస్తోంది. ఈచిత్రం షూటింగ్ ఈ మధ్య ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. సెట్ అనుకున్న విధంగా రాకపోవడంతో కేవలం కొన్ని సీన్స్ మాత్రమే తీసి షూటింగ్‌ని ఆపేశారని వార్తలు వచ్చాయి. ఇక మొదటి షెడ్యూల్ ప్రకారం తీయాల్సిన సీన్స్‌లో కనీసం సగం కూడా శంకర్ పూర్తి చేయలేదని సమాచారం. మొదటి షెడ్యూల్‌కి రెండున్నర కోట్లు అనుకుంటే అది ఆరు కోట్లని దాటిందని సమాచారం.
మరోవైపు బడ్జెట్ విషయంలో లైకా వారు కోపంతో ఉన్నారని వార్తలు వస్తున్నా కూడా లైకా సంస్థ ఇప్పటివరకు వాటిని ఖండించింది. కానీ మరలా వ్యవహారం మొదటికి వచ్చిందట. దాంతో త్వరలో ఏ విషయం లైకా సంస్థ అఫీషియల్‌గా అనౌన్స్ చేయనుందని తెలుస్తోంది.