రాత్రికి రాత్రి లైమ్ లైట్‌లోకి వచ్చిన వారిపై మిగతా వర్గానికి, వైరి వర్గాలని ఈర్ష, ద్వేషం వుండటం సహజం. అదే ఈర్ష `కేజీఎఫ్` హీరోని ప్రమాదంలోకి నెట్టేస్తోందా?. కన్నడలో చిన్న హీరో అయిన యష్ `కేజీఎఫ్`లో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దీన్ని జీర్ణించుకోలేని వాళ్లు అతన్ని హత్య చేయడానికి ప్లాన్ చేస్తున్నారని, అందుకు భారీ క్రిమినల్స్‌కి సుపారీ ఇచ్చారని కర్ణాటకలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. కన్నడ మీడియాతో పాటు జాతీయ మీడియాలోనూ సంచలనం సృష్టిస్తున్న ఈ వార్తపై హీరో యష్ వివరణ ఇచ్చేశాడు.
ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని హీరో రాక్‌స్టార్ యష్ క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో మీడియా అతి చేస్తోందని మండిపడ్డారు. మీడియా అతి ప్రచారం వల్ల తన కుటుంబం తీవ్ర మనో వేదనకు గురైందని, ఇక నుంచైనా నిరాధారమైన వార్తలు ప్రచారం చేయడం మానుకోవాలని తీవ్ర స్థాయిలో హెచ్చరించాడు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకుని వార్తల్సిప్రచారం చేయాలని, సంచలనం కోసం మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేయొద్దని హితవు పలికాడు. తనపై ఎవరికీ ద్వేషం లేదని, తనని ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న ప్రచారంపై సీసీబీ అడిషనల్ కమీషనర్ అలోక్ కుమార్‌తో పాటు కర్ణాటక హోమ్ మినిస్టర్ ఎంబీ పాటిల్‌ని కూడా కలిసి చర్చించానని తెలిపాడు.
తనని చంపేస్తానంటూ ఎలాంటి బెదిరింపు ఫోన్ కాల్స్ తనకు రాలేదని యష్ చెప్పడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. `కేజీఎష్`తో జాతీయ స్థాయిలో యష్‌కు గుర్తింపు లభించడంతో తాజా ఉదంతంపై జాతీయ మీడియా కూడా ఫోకస్ పెట్టింది. యష్‌కు సంబంధించిన వరుస కథనాలను ప్రసారం చేయడంతో యష్ హత్య కోసం జరుగుతున్న ప్లాన్ సర్వత్రా సంచలనంగా మారింది. అయితే గత ఆరు నెలల క్రితం ఓ నటుడిని చంపడం కోసం సుపారీ తీసుకున్న ముఠాను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేయడం మరింత సంచలనంగా మారింది. అయితే తనపై వస్తున్న వార్తలన్నీ గాలి వార్తలే నని యష్ కొట్టిపారేయడం విశేషం.