యంగ్‌రెబెల్‌స్టార్ ప్రభాస్ బాహుబలి వంటి చారిత్రాత్మకమైన విజయం సాధించిన చిత్రం తర్వాత సాహో చిత్రం ఒప్పుకోవడం మొదట్లో పలు అనుమానాలకు తావిచ్చింది. ఒకే ఒక్క చిత్రం అనుభవం ఉన్న సుజీత్ చేతిలో ఈ చిత్రాన్ని పెట్టారు. ఇక సాహో మొదటి మేకింగ్ వీడియోగా ‘షేడ్స్ ఆఫ్ సాహో 1’ మంచి జోరు చూపించింది. ఈ మేకింగ్ వీడియో వల్లనే హింది శాటిలైట్, థియేటికల్ రైట్స్ అమ్ముడుపోయాయి.
ఇక తాజాగా విడుదల చేసిన మరో మేకింగ్ వీడియో ‘షేడ్స్ ఆఫ్ సాహో 2’ ప్రభంజనం మామూలుగా లేదు. కోటి, రెండు కోట్లు.. ఇలా ఈ వీడియో వ్యూస్ పెరిగిపోతున్నాయి. దుబాయ్, అబుదాబి దేశాలలో చిత్రీకరించిన భారీ యాక్షన్ సీన్స్‌కి సంబంధించిన మేకింగ్ వీడియో అదిరిపోయింది. హాలీవుడ్ నుంచి వచ్చిన స్టంట్స్ కొరియోగ్రాఫర్ కెన్నీబెట్స్ నేతృత్వంలో వీటి చిత్రీకరణ జరిగింది. ఈ వీడియో తర్వాత ఓవర్‌సీస్ రైట్స్‌కి భారీ డిమాండ్ ఏర్పడింది.
తాజా సమాచారం ప్రకారం ‘సాహో’ ఓవర్‌సీస్ రైట్స్‌ని దుబాయ్‌కి చెందిన ప్రఖ్యాత ఫార్స్‌ఫిలిం సంస్థ సొంతం చేసుకుంది. దీని విలువ 45 కోట్లకు పైనే అని సమాచారం. గతంలో ఇదే సంస్థ 2.ఓ చిత్రాన్ని కూడా కొనుగోలు చేసింది. అయితే ఈ సంస్థకు సాహో నిర్మాతలు చైనా హక్కులను మాత్రం ఇవ్వలేదు.
ఇక సాహో చిత్రానికి సంబంధించిన అద్భుతమైన ఇంటర్వెల్ బ్యాంగ్‌ని రామోజీ ఫిలిం సిటీలో ప్లాన్ చేస్తున్నారు. ఈ పోరాట దృశ్యాల చిత్రీకరణ కోసం కెన్నీబెట్స్ హైదరాబాద్ రానున్నాడు. ఇక ఈ ఒక్క ఇంటర్వెల్ బ్యాంగ్ కోసమే ఏకంగా 30కోట్లకు పైగా బడ్జెట్‌ని కేటాయిస్తున్నారని తెలుస్తోంది. తెలుగులో ఓ మీడియం బడ్జెట్ సినిమాకి సరిపడే మొత్తం ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ కోసమే ఖర్చుపెడుతూ ఉండటంతో ఈ చిత్రంలో ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా ఉండనుంది? అనేది ఆసక్తికరంగా మారింది.