ప్రస్తుతం ఆడ పిల్లలకు ఇంటా, బయటా రక్షణ లేకుండా పోయింది. ప్రతి చోటా శారీరక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశాలను బేస్ చేసుకుని సామాజిక ఇతివృత్తంతో తమిళంలో రూపొందిన చిత్రం ‘ఆరుద్ర’. ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ చిత్రాన్ని అదే పేరుతో వరకాంతం సునీల్ రెడ్డి సమర్పణలో జె.ఎల్.కె. ఎంటర్ ప్రైజెస్ తెలుగులోకి అనువదిస్తోంది. పా.విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పా.విజయ్, కె.భాగ్యరాజు కీలక పాత్రలో నటిస్తుండగా మేఘాలీ, దక్షిత, సోని, సంజన సింగ్ హీరోయిన్స్ గా నటించారు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ... ‘‘తమిళంలో తొలిసారిగా పూర్తి స్థాయిలో చైల్డ్ అబ్యూస్ మెంట్ పై రూపొందిన చిత్రం ‘ఆరుద్ర’. ఇందులో పిల్లలకు, పేరెంట్స్ కు మంచి సందేశం ఇచ్చారు. గుడ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి అందరికీ అర్థమయ్యేలా దర్శకుడు చాలా బాగా చూపించారు. వీటితో పాటు లవ్, కామెడీ మరియు ఎమోషన్స్ ఇలా అన్ని వర్గాలకు నచ్చే అంశాలున్నాయి.
తమిళంలో ఇటీవల విడుదలై క్రిటిక్స్ తో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న చిత్రమిది. అక్కడ మంచి వసూళ్లు రాబట్టింది. యూనివర్సల్ కాన్సెప్ట్ కాబట్టి తెలుగులోకి అనువదిస్తున్నాం. పా.విజయ్ దర్శకత్వం, విద్యాసాగర్ సంగీతం, కె.భాగ్యరాజా గారి క్యారక్టర్ సినిమాకు హైలెట్స్ గా ఉంటాయి. వెన్నెలకంటి పర్యవేక్షణలో అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. విద్యాసాగర్ సంగీత సారథ్యంలో పాటలు అన్నీ అద్భుతంగా వచ్చాయి. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: విద్యాసాగర్; నిర్మాత: జె.ఎల్.కె. ఎంటర్ ప్రైజెస్; దర్శకత్వం: పా.విజయ్.