బిజెపికి, హిందుత్వ వాదులకు ఎప్పుడు ఎన్నికల్లో దేశభక్తి, గోసంరక్షణ, హిందువుల ఐక్యత, ముస్లింలపై ద్వేషం, నాడు అయోధ్య, నేడు శబరిమల, పాకిస్థాన్‌పై పుల్వామా ఘటనలో ఎదురుదాడి వంటివి వస్తూ ఉంటాయి. కాశ్మీర్‌కి ఉన్న స్పెషల్ ఆర్టికల్‌ని రద్దు చేయాలని అధికారంలోకి వచ్చిన బిజెపి దానిని మాత్రం చేయలేకపోయింది. ఇంకా వారి చేతల్లో ట్రిపుల్ తలాక్‌తో పాటు పలు అంశాలున్నాయి. తమకి సంప్రదాయంగా వస్తోన్న హిందు ఓటు బ్యాంక్‌పై వారి కన్ను ఎప్పుడు ఉంటుంది. ఇక ‘వందేమాతరం’ వంటి గీతాలను కూడా వారు తెరపైకి తెస్తుంటారు.
ఇక హిందువుల విషయానికి వస్తే గోవు అనేది సకల దైవాలకు ప్రతి రూపం. గోసేవనే దేవుని సేవగా హిందువులు భావిస్తుంటారు. గతంలో రజనీ కాంత్ కూడా తాను పెట్టే పార్టీ ఆధ్యాత్మిక రాజకీయాలకు ప్రధాన కేంద్రంగా ఉంటుందని చెప్పాడు. ఇప్పుడు పవన్ కూడా అదే దారిలో నడుస్తున్నాడు. వాస్తవానికి పవన్‌కి మొదటి నుంచి రైతు కావాలని, వ్యవసాయం చేయాలనే కోరిక ఉందని పలుసార్లు చెప్పాడు. వ్యవసాయం, రైతులు, పశుసంరక్షణతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాల మీద ఆయనకు మక్కువ ఎక్కువని, దక్షిణాదిలో పెద్దగా పట్టులేని హిందుత్వ ఓట్లను పవన్ కూడా తనవైపుకు మళ్లించుకోవాలని చూస్తున్నట్లు గత కొంతకాలంగా విశ్లేషణలు వస్తున్నాయి. తమిళనాడులో రజనీకాంత్, ఏపీలో పవన్‌లు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు.
ఇక విషయానికి వస్తే పవన్ తాజాగా హిందువులను తనవైపుకి తిప్పే మంచి పని చేశాడు. ఆయన చేసింది రాజకీయం కోసం కాకపోయినా అది రాజకీయంగా పరిణామం చెందే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ‘రైతు జీవితం, పాడి, పంట కల నేత’ అని చెప్పుకునే ఆయన తనకి అవకాశం వచ్చినప్పుడల్లా గోసేవ చేస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టే ఆయన జనసేన మూల సిద్దాంతాలలో ‘సంస్కృతులను కాపాడే సమాజం’ అనే అంశాన్ని చేర్చాడు. ఇందుకు నిదర్శనంగా ఆయన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో గోశాలను ఏర్పాటు చేశాడు.
తాజాగా ఆయన గోసేవలో మునిగిపోయారు. గోవులకు మేత వేస్తూ బిజీబిజీగా గడిపాడు. ఈ అంశం ప్రస్తుతం రాజకీయ పార్టీలలో ఒక ప్రకంపన సృష్టిస్తోంది. దేశ సంస్కృతులను, సంప్రదాయాలను గౌరవిస్తూనే మైనార్టీల విషయంలో కూడా పవన్ గట్టి ఆశయాలతో ఉన్నాడు. మరి ఇదైనా ఆయనకు ఎన్నికలలో ఓట్లను కొల్లగొడుతుందా? లేదా? అనేది హాట్‌టాపిక్‌గా మారింది.