కంటెంట్ కంటే ప్రమోషన్‌ని నమ్ముకునే దర్శకుల్లో వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ ముందుంటాడు. బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్‌గా తీసిన కథానాయకుడు, మహానాయకుడు డిజాస్టర్స్ కావడంలో వర్మ మరింత ఊపు మీదున్నాడు. బాలయ్యాస్ ఎన్టీఆర్ బయోపిక్‌లో వాస్తవాలను దాచి, తమకు నచ్చిన విధంగా చరిత్రను వక్రీకరించారనే మన ప్రేక్షకులు ఆ చిత్రాలను డిజాస్టర్స్ చేశారనే ప్రచారం బాగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చివరి రోజుల్లో ఎన్టీఆర్ మనోవేదన, లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ జీవితంలోకి రావడం, ఆమెని పలు విధాలుగా అవమానించడం, చివరకు చంద్రబాబు ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడవడం వంటి మూడు నాలుగు అంశాల చుట్టూనే వర్మ బాగా ప్రిపేర్ చేస్తున్నాడని సమాచారం. రెండు వారాల కిందట మూడు నిమిషాల ట్రైలర్‌లో అసలు ఈ చిత్రంలో ఏం ఉండనుంది? అనే విషయాలపై క్లారిటీ ఇచ్చిన వర్మ తాజాగా రెండో థియేటికల్ ట్రైలర్‌ని విడుదల చేశాడు.
ఇందులో ఎన్టీఆర్ ‘వాడు, నా పిల్లలు కలిసి నన్ను చంపేశారు’ అనే ట్యాగ్‌లైన్‌లో ట్రైలర్‌ని స్టార్ట్ చేశాడు. ‘నేను.. నేను కాను... నేను నా ప్రజలు.. నా ప్రజలే నన్నింతటి వాడిని చేశారు. ఇప్పుడు వాళ్లే వద్దు అనుకుని నా పవర్‌ని లాగేసుకున్నారు..’ అనే డైలాగ్ అద్భుతంగా పేలింది. ఇక లక్ష్మీపార్వతిని ఉద్దేశించి చంద్రబాబునాయుడు ‘ఆవిడ మీరనుకున్నట్లు అంత మంచి మనిషి కాదు. ఇంతకు ముందే ఆమెకి పలువురితో ఎఫైర్స్ ఉన్నాయి’ అంటూ చంద్రబాబు పాత్రధారి చేత చెప్పించాడు.
ఇక లక్ష్మీపార్వతి తన మొదటి భర్త వీరగ్రంధం సుబ్బారావుతో ‘ఎన్టీఆర్ నన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు’ అని చెప్పే సీన్ కూడా ఉంది. ‘శ్రీదేవి, జయప్రద, జయసుధ.. వంటి మహా మహా అందగత్తెలతో పరిచయం ఉన్న ఆయనకు దానిలో ఏముందనో’ అనే డైలాగ్‌ని ఎన్టీఆర్ కూతురి చేత చెప్పించడం విశేషం. ‘మనం ఎందుకు పనికి రాని దద్దమ్మలను అనుకుంటున్నారా? లోకేష్ మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. .దానిని ఆపాలని నేను చేసే ప్రయత్నానికి వంద శాతం సపోర్ట్ కావాలి..’ అన్న డైలాగ్‌లు చంద్రబాబుతో చెప్పించినట్లు అర్ధమవుతోంది.
‘వెన్నుపోటు పొడిచారు.. కుట్ర’ పాటల ప్రోమో, చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం వంటివి చూపించారు. చివరగా ‘మన దగ్గర నిజం ఉంది. నిజాన్ని ఎవ్వరు దాచలేరు. గర్జన. సింహగర్జన’ అంటూ సాగిన ఈ రెండో ట్రైలర్ కూడా వర్మ అభిమానులకు, ఇందులో చూపించే వాస్తవాలను తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న వారందరిలో ఇది క్యూరియాసిటీని మరింతగా పెంచిందనే చెప్పాలి.