తెలుగు సినిమా పరిశ్రమ బాలీవుడ్ తర్వాత అత్యధిక చిత్రాలను నిర్మించే ఇండస్ట్రీలలో ఒకటి. సినిమా ఇండస్ట్రీలో కనీసం విజయాల శాతం 10శాతం కూడా లేని పరిశ్రమ. అందుకే మంచి చిత్రం వచ్చినప్పుడు అందరు దానిని బాగా ఆడేలా ఆడియన్స్‌కి రీచ్ అయ్యేలా తమ వంతు ప్రయత్నాలు చేయాలి. గతంలో రాజమౌళి ఏదైనా చిత్రం బాగుంటే దానిని బాగా ప్రమోట్ చేసేవాడు. మరి ‘ఆర్‌ఆర్‌ఆర్’ బిజీలో ఉన్నాడో లేక ఎందుకోగానీ ఈయన ఈమధ్య పలు చిత్రాల విషయంలో ట్విట్టర్ వేదికగా మౌనం పాటిస్తున్నాడు. ఇక తెలుగులోని స్టార్స్‌లో సినిమా బాగుంటే ఏ సినిమాని అయినా మెచ్చుకుని, తన అభిమానులకు ఆ సినిమా పట్ల ఆసక్తిని రేకెత్తించేలా చేయడంలో సూపర్‌స్టార్ మహేష్‌బాబు ముందుంటాడు. ఇటీవల ఆయన కథానాయకుడు చిత్రానికి మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు. కానీ ఆ చిత్రం అనూహ్యమైన పరాజయాన్ని చవిచూసింది.
తాజాగా మహేష్ అబ్బాయ్ నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటించిన థ్రిల్లర్ మూవీ 118 పై ప్రశంసలు కురిపించాడు. నిజానికి చాలా తక్కువ బడ్జెట్‌లో రూపొందిన ఈ విభిన్న ప్రయోగాత్మక చిత్రం మార్చి 1న విడుదలై మంచి కలెక్షన్లు సాధిస్తోంది. బడ్జెట్ లిమిట్స్‌లో ఉండటం వల్ల పటాస్ తర్వాత 118 కళ్యాణ్‌రామ్ కెరీర్‌లో హిట్ చిత్రంగా దీనిని చెప్పాలి. ముఖ్యంగా గుహన్ టేకింగ్, సినిమాటోగ్రఫీ వంటివి ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ఈ కథ ‘కోకిల, చెట్టుకిందప్లీడర్’ తరహాలో ఉందని కామెంట్స్ వచ్చినా కూడా పాత సారాని కొత్త సీసాలో నింపడంలో యూనిట్ ఖచ్చితంగా సక్సెస్ అయిందనే చెప్పాలి. అందునా ఈ జనరేషన్ ప్రేక్షకులకు ‘కోకిల, చెట్టుకిందప్లీడర్’ చిత్రాలు పెద్దగా తెలియకపోవచ్చు. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించి, లాభాల బాటలో నడుస్తున్న 118 చిత్రాన్ని తాజాగా మహేష్‌బాబు చూసి స్పందించాడు.
ఆయన మాట్లాడుతూ, ఆకట్టుకునే కథ, ఆసక్తిని రేకెత్తించే కథనాలతో సాగే ఈ చిత్రాన్ని చూస్తూ ఎంతో ఎంజాయ్ చేశాను. దర్శకునిగా, సినిమాటోగ్రాఫర్‌గా గుహన్ అద్భుతమైన పనితీరు కనబరిచారు. ఈ సినిమా ఈ స్థాయిలో ఆవిష్కరించ బడటానికి కారణమైన యూనిట్‌కి నా అభినందనలు... అని తెలిపాడు. మహేష్ స్పందనకు ఎంతో సంతోషించిన ఈ చిత్ర యూనిట్ మహేష్‌బాబుకి ధన్యవాదాలు కూడా తెలపడం విశేషం.