మన దేశంపై ఎన్నోసార్లు పాక్‌లో నివాసం ఉన్న తీవ్రవాదులు, ఉగ్రవాదులు దాడి చేశారు. కార్గిల్ నుంచి ముంబైలోని తాజ్‌హోటల్ ఘటన నుంచి తాజాగా పుల్వామా దాడి వరకు ఇవి ఎన్నో ఉన్నాయి. అయితే పాకిస్థాన్‌లో అక్రమంగా నివాసం ఉంటున్న తీవ్రవాదులు మన దేశంపైకి దాడి చేసినప్పుడు పాకిస్థాన్‌లోని అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటిపైకి వస్తున్నాయి. తమ దేశం మీద ఈ దాడులను మోపడం సరికాదని దొంగే దొంగా దొంగా అని అరిచినట్లుగా చేస్తున్నా, వారిలో ఎవరు అధికారంలో ఉన్నా కూడా వారు ఏకకంఠంతో తమ వాదనను తెలుపుతున్నారు. కానీ మనదేశంలో అలా కాదు.
ఇలాంటి ఉగ్రదాడులను కూడా రాజకీయాలకు వాడుకోవడం అనాదిగా వస్తోంది. ఇప్పటికే దిగ్విజయ్ సింగ్ వంటి వారు పుల్వామా దాడిని ఓ ప్రమాద ఘటనగా చిత్రీకరిస్తున్నారు. ఆధారాలు బయట పెట్టాలని కోరుతున్నారు. అసలు ఎంత మంది తీవ్రవాదులను మన దేశం మట్టుబెట్టింది? అనే విషయంలో పలు అనుమానాలు ఉన్నాయి. ఇక బిజెపి దీనిని తమ వచ్చే ఎన్నికల్లో తురుపుముక్కగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఆ దిశగా ఆ పార్టీ పావులు కదుపుతోంది. ఇప్పటికే ఈ ప్రభావం ఉత్తరాదిని బలంగా ఉందని, పుల్వామా దాడి, పాకిస్థాన్‌పై ఎదురు దాడి వల్ల ఎన్డీయే సీట్లు మరింతగా పెరుగుతాయని సర్వేలు సూచిస్తున్నాయి.
ఇక విషయానికి వస్తే పుల్వామా దాడి ఘటన తర్వాత ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో పదిరోజులు భారతదేశం ఎవరితోనైనా యుద్దం చేస్తే ఆయుధాగారాలు ఖాళీ అయ్యే పరిస్థితి ఉందని తేల్చిచెప్పడం మన నాయకులు దౌర్బాగ్యాన్ని బట్టబయలు చేస్తోంది. దేశంలో అత్యంత ఎక్కువ స్కామ్‌లు రక్షణ రంగంలోనే జరుగుతున్నాయన్న విషయాన్ని ఇవి తేటతెల్లం చేస్తున్నాయి. రక్షణ రంగం అంటే ఎవరైనా వివరాలు అడిగినా దేశభద్రత దృష్ట్యా వాటిని చెప్పాల్సిన, జవాబుదారీ కావాల్సిన అవసరం లేదన్నధీమా రక్షణ రంగంలో భారీ అవినీతికి కారణమవుతోంది.
బోఫోర్స్ నుంచి శవ పేటికలు, వైమానిక విమానాల కొనుగోలు, రాఫెల్ అవినీతి,.. ఇలా ఎన్నో మన వీరసైనికుల ప్రాణత్యాగాలకు అర్ధం లేకుండా చేస్తున్నాయి. పవన్‌పై విమర్శలు వచ్చి ఉండవచ్చుగానీ ఎన్నికల ముందు బిజెపి ప్రభుత్వం పాకిస్థాన్‌పై దాడి ద్వారా ఈ దేశానికి తామే పెద్ద రక్ష అనే భావన కల్పించేలా యుద్దానికి దిగవచ్చని ఎప్పటి నుంచో విశ్లేషకులు, మీడియా చెబుతూనే వస్తోంది. చివరకు అనుకున్నట్లుగానే ఎన్నికల సమయంలో తమ దేశభక్తి ఇది అని నిరూపించుకునేందుకు, తామైతేనే దేశానికి రక్షణ కల్పిస్తామనే బిజెపి బండారం బయటపడిందనే చెప్పాలి. నిజానికి బిజెపికి అంత దమ్ము దైర్యం ఉంటే పాకిస్థాన్‌తో ప్రత్యక్ష యుద్దానికి దిగాలి. అది జరిగితే తప్ప కాశ్మీర్ సమస్యకి పరిష్కారం దొరకదు.
అయోధ్యలోని బాబ్రిమసీద్, రామ మందిరం సమస్య చివరకు ఎలా పరిష్కారం అయిందో అందరికీ తెలుసు. నాడు చాలా మంది పీవీ నరసింహారావు అలసత్వం వల్లనే బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిందని ఆడిపోసుకున్నా కూడా రావణకాష్టంలా మండుతోన్న ఈ సమస్యకు అంతకు మించిన ప్రత్యామ్నాయం లేదు. ఇలానే పాకిస్థాన్, కాశ్మీర్ సమస్యల పరిష్కారానికి, ఆక్రమిత కాశ్మీర్‌ని మనం స్వాధీనం చేసుకోవడానికి యుద్దం తప్ప.. అందరు చెప్పినట్లుగా నంగి నంగి పరిష్కారాలు మార్గం చూపలేవనే చెప్పాలి.