నిజానికి ఓ పెద్ద స్టార్ చిత్రం వస్తోంది అంటే తెలియకుండానే ఇతర చిత్రాల రిలీజ్ విషయం నుంచి ప్రతి అంశంలోనూ ఇబ్బందులు తప్పవు. తమ చిత్రం దేనికి పోటీ కాదని నోటి మాటగా చెప్పవచ్చు గానీ అవ్వన్నీ నిజం కాదు. పెద్ద చిత్రాల వల్ల అదే సమయంలో విడుదల చేయాలనుకునే చిత్రాలు థియేటర్ల నుంచి ప్రతి విషయంలోనూ ఇబ్బందులు ఎదుర్కొవడం మాత్రం నిజం.
ఇక విషయానికి వస్తే మొదట మహేష్‌బాబు నటిస్తోన్న ప్రతిష్టాత్మక 25వ చిత్రం ‘మహర్షి’ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేస్తామని ప్రకటించాడు. ఏకంగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు, అశ్వనీదత్, పివిపిలు నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న అని అనుకున్న తర్వాత అదే తేదీని ఫిక్స్ చేసుకున్న నాగచైతన్య-సమంతల ‘మజిలీ’, నేచురల్‌స్టార్ నాని ‘జెర్సీ’ చిత్రాల విడుదల సందర్భంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక ‘మహర్షి’ని ఏప్రిల్ 25 అన్నారు. దాంతో ‘మజిలీ, జెర్సీ’ చిత్రాలు రెండు ఏప్రిల్ 5కే షెడ్యూల్ కానున్నాయని వార్తలు వచ్చాయి. తాజాగా ‘మహర్షి’ చిత్రం మరోసారి మే 9కి ఫిక్స్ అయింది. దాంతో ‘మజిలీ, జెర్సీ’ చిత్రాలు ఊపిరి పీల్చుకున్నాయి. ‘మహర్షి’ వాయిదా పుణ్యమా అని ‘మజిలీ’ ఏప్రిల్ 5న రానుండగా, ఏప్రిల్ 19న ‘జెర్సీ’ విడుదల కావడం ఖాయమని తెలుస్తోంది.
మరోవైపు సాయిధరమ్‌తేజ్ ‘చిత్రలహరి’ చిత్రం కూడా ఏప్రిల్ 12న రావడం ఖాయమని అంటున్నారు. అలా ‘మహర్షి’ వాయిదా పుణ్యమా అని మూడు యంగ్ హీరోల చిత్రాలకు సోలో రిలీజ్‌లు దక్కడం ఆనందించదగ్గ విషయమేనని చెప్పాలి. ఇక మహర్షి చిత్రాన్ని మే9న విడుదల చేస్తూ దిల్‌రాజు ఈ చిత్రం నిర్మాతల్లో ఒకరైన అశ్వనీదత్ తీసిన జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి చిత్రాలు రెండు మే9నే విడుదలయ్యాయని, కాబట్టి అదే తేదీన మహర్షి రానుండటంతో విజయం గ్యారంటీ అని సరికొత్త సెంటిమెంట్‌కి భాష్యం చెప్పాడు.
కానీ మేలో మహేష్ చిత్రాలు పెద్దగా హిట్టయిన దాఖలాలు లేవు. ఉదాహరణకు ఈ సెంటిమెంట్ విషయం ఎంత ఫూలిష్‌గా ఉంటుంది అంటే దిల్‌రాజు తీసిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించింది. కానీ తర్వాత అదే సీజన్‌లో వచ్చిన 1 (నేనొక్కడినే) చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. కాబట్టి మంత్రాలకు చింతకాయలు రాలవన్నట్లుగా, కంటెంట్ లేకుండా సెంటిమెంట్‌నే నమ్ముకోవడం సరికాదనే చెప్పాలి.