2019 మొదలైన తర్వాత సంక్రాంతికి వచ్చిన భారీ చిత్రాలైన ‘వినయ విధేయ రామ’, ‘కథానాయకుడు’, ఆ తర్వాత ‘మహానాయకుడు’ చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఇక సంక్రాంతి విజేతగా అనిల్‌రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా విక్టరీ వెంకటేష్, వరుణ్‌తేజ్‌లు నటించిన ‘ఎఫ్2’ అనే మీడియం బడ్జెట్ చిత్రం ఏకంగా 130కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత కూడా కాస్త తక్కువ బడ్జెట్‌తో కంటెంట్‌ని నమ్ముకుని, చిన్న చిత్రాలుగా వచ్చిన ‘యాత్ర’, తాజాగా కళ్యాణ్‌రామ్ ‘118’లు లాభాలను ఆర్జిస్తున్నాయి. సో.. ఈ ఏడాది భారీ బడ్జెట్ చిత్రాల కంటే తక్కువ బడ్జెట్‌తో కంటెంట్‌ని నమ్ముకుని వచ్చిన చిత్రాలే ఆడుతున్నాయి. బహుశా ఈ పరిణామం అల్లు వారి చిన్నబ్బాయ్ అల్లుశిరీష్‌కి మంచి శకునంలా ఉందనే చెప్పాలి.
ఎందుకంటే ఎప్పుడో ‘ప్రతిబంధ్’ వంటి చిత్రాలలో బాలనటునిగా కనిపించిన ఆయన ‘గౌరవం’తో హీరోగా మారాడు. ‘గౌరవం’ నుంచి ‘కొత్తజంట, 1971 బియాండ్ బోర్డర్స్, ఒక్క క్షణం’ వంటి పలు చిత్రాల ద్వారా ఫ్లాప్ హీరోగానే ముద్ర పడ్డాడు. తాజాగా ఎట్టకేలకు ఆయన మలయాళంలో మంచి విజయం సాధించిన ‘ఎబిసిడి’ అనే మూవీ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. ‘ఎబిసిడి’ అంటే అమెరికన్ బోర్న్‌డ్ కన్‌ఫ్యూజ్‌డ్ దేశీ. మలయాళంలో ఆల్‌రెడీ ప్రూవ్ అయిన సబ్జెక్ట్ కావడం, ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్‌తో పాటు ఎంతో కాలం తర్వాత అల్లుశిరీష్ తనకి సూట్ అయ్యే స్టోరీని ఒప్పుకున్నాడనే పాజిటివ్ కామెంట్స్ ఈ చిత్రానికి లభిస్తూ ఉండటం విశేషం.
సంజీవ్‌రెడ్డి దర్శకత్వంలో మధుర శ్రీధర్, యశ్‌రంగినేని ఈ మూవీకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రుక్సార్‌థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈచిత్రం నుంచి తాజాగా ఓ లిరికల్ వీడియోను విడుదల చేశారు. ‘ముంతకల్లు చేతబట్టి తాగుతుంటే నువ్వెత్తి... ఒళ్లంతా మత్తెక్కి ఊగిపోదా ఓ రబ్బీ.. జట్టు కట్టి పోదామా.. స్వర్గమే చూద్దామా...చుక్కలన్ని చుట్టి దిగి కిందకు వద్దామా’ అంటూ సాగే ఈ పాట బాగా క్యాచీగా ఉంది. కల్లు దుకాణం నేపధ్యంలో సాగే పాట ఇది అని అర్ధమవుతోంది.
జుడీశాండీ సంగీతం.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ బాగున్నాయి. మాస్, యూత్‌ని ఆకట్టుకుంటూ సాగేలా ఈ పాట ఉంది. వారిని మెప్పించడంలో ఈ పాట ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే చెప్పాలి. త్వరలోనే విడుదల కానున్న ఈ చిత్రం ‘శ్రీరస్తు..శుభమస్తు’ చిత్రం తర్వాత అల్లుశిరీష్‌కి మరో విజయం అందిస్తుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. మరి అల్లు వారి అబ్బాయికి ‘ఎబిసిడి’ ఎలాంటి ఫలితం అందిస్తుందో వేచిచూడాల్సివుంది...!