మన సినిమాలలో హీరో అనేది కామన్ పదం. ఓ చిత్రాన్ని నడిపించే కీలక నటుడు హీరేనే అవుతాడు. అంతేందుకు హీరో పేరుతో వచ్చిన సైకిల్స్ నుంచి బైక్‌ల వరకు ఇది ఓ పర్యాయపదంగా మారింది. జాకీష్రాఫ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ చిత్రం ‘హీరో’ పెద్ద విజయం సాధించింది. కానీ నాగార్జున అదే చిత్రం రీమేక్ ‘విక్రమ్’తో తెలుగులోకి హీరోగా పరిచయం అయ్యాడు. కానీ ఈ హీరో అనే టైటిల్ మాత్రం దక్షిణాదిన అందునా తెలుగులో పెద్దగా అచ్చిరాలేదు. నాడు మూడు దశాబ్దాల కిందట సుప్రీం హీరోగా ఉన్న చిరంజీవి హీరో పేరుతో ఓ చిత్రం చేశాడు. అది డిజాస్టర్‌గా మిగిలింది. వరుస ఫ్లాప్‌లలో ఉన్న సమయంలో అదే హీరో టైటిల్‌తో నితిన్ ఓ చిత్రం చేస్తే అది ఎప్పుడు విడుదలైంది? ఎప్పుడు పోయింది కూడా తెలియదు.
ఇక విషయానికి వస్తే తెలుగులో అతి తక్కువ చిత్రాలతోనే సెన్సేషనల్ స్టార్‌గా, తెలంగాణ మెగాస్టార్‌గా పేరు తెచ్చుకున్న రౌడీస్టార్ విజయ్ దేవరకొండ. ఆయన నటించిన అర్జున్‌రెడ్డి, గీత గోవిందం, ట్యాక్సీవాలా వంటి చిత్రాలు అద్భుత విజయం సాధించాయి. లక్కీగా ఈహీరోకి తమిళంలోనే కాదు.. బాలీవుడ్‌లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఈయన నటించిన చిత్రాలు తెలుగులోనే కాకుండా తమిళంలో విడుదలై మంచి గుర్తింపును తెచ్చాయి. మరోవైపు అర్జున్‌రెడ్డి బాలీవుడ్ రీమేక్ వల్ల బాలీవుడ్ పరిశ్రమ కన్ను, అదే చిత్రం తమిళ రీమేక్ దృవ వల్ల కోలీవుడ్ జనాలు కూడా ఈయనను గుర్తించడం మొదలుపెట్టారు. తెలుగు హీరోలు ఎంతో మంది తమిళంలో ఎంట్రీ ఇవ్వాలని భావించినా, వారి ఆశలు నెరవేరలేదు. ఇందులో అల్లరినరేష్ నుంచి సందీప్‌కిషన్, మహేష్‌బాబు వరకు ఎందరో లిస్ట్‌లో ఉన్నారు.
కానీ పెద్దగా ప్రయత్నాలేమీ లేకుండానే విజయ్‌కి నోటా చిత్రంతో తమిళ, తెలుగులో బైలింగ్వల్ చిత్రం చాన్స్ వచ్చింది. ఇది పెద్దగా ఆడకపోయినా విజయ్ మీద కోలీవుడ్ నమ్మకం పోలేదు. తాజాగా మరో బైలింగ్వల్ చిత్రానికి విజయ్ ఓకే చెప్పాడట. ఇది తమిళ, తెలుగు భాషల్లో రూపొందనుంది. ‘కాకముట్టై’ అనే నేషనల్ అవార్డు విన్నింగ్ చిత్రానికి రచయితగా పనిచేసిన ఆనంద్ అన్నమలై ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. ‘మహర్షి’ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తోన్న మోహనన్ కుమార్తె మాళవిక మోహనన్ ఇందులో హీరోయిన్‌గా నటించనుంది. ఈ మూవీని సూర్య కజిన్ ప్రభు డ్రీమ్ వారియర్స్ పతాకంపై నిర్మించనున్నాడు. ఈ చిత్రం జూలై లేదా ఆగష్టులో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో హీరో ఓ ప్రొఫెషనల్ బైక్ రైడర్‌గా కనిపిస్తాడని, దాంతో ‘హీరో’ అనే టైటిల్ పెట్టాలని టీం భావిస్తోందని సమాచారం.
ఏదో విధంగా తన ప్రతి చిత్రం విషయంలో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకునే విజయ్ ఈ టైటిల్‌కి ఉన్న సెంటిమెంట్‌ని బ్రేక్ చేస్తాడా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది. మరోవైపు విజయ్‌నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం మేలో విడుదల కానుండగా, ప్రస్తుతం ఆయన క్రాంతి మాధవ్ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.