తెలుగులో వచ్చినంత ఫుల్‌లెంగ్త్ కామెడీ చిత్రాలు ఒకనాడు ఇతర భాషల్లో వచ్చేవి కావు. కామెడీకి స్టార్ స్టేటస్ తెచ్చిన వారిలో జంధ్యాల, రేలంగి నరసింహారావులు ఒక తరంలో మెప్పించారు. ఇక ఆ తర్వాత ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీకృష్ణారెడ్డిల మధ్య మంచి పోటాపోటీ వాతావరణం కనిపించేది. ఇక రాజేంద్రప్రసాద్, సీనియర్ నరేష్, ఆ తర్వాత అల్లరినరేష్‌లు కామెడీ చిత్రాలతో ఒక ఊపు ఊపారు. ఆమధ్య భీమనేని శ్రీనివాసరావు, అల్లరి రవిబాబు, దేవీ ప్రసాద్, ఈవీవీ సత్తిబాబు వంటి దర్శకులు కామెడీ దర్శకులుగా ప్రయత్నించినా కూడా ఎక్కువకాలం రన్ కాలేకపోయారు.
ఇక తాజాగా ప్రతి సినిమాని తమదైన ఎంటర్‌టైన్‌మెంట్‌ని రంగరించి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో నేటితరంలో మారుతి, అనిల్‌రావిపూడిలు పోటీ పడుతున్నారనే చెప్పాలి. కానీ అనిల్‌రావిపూడి దూసుకెళ్తున్న తీరు చూస్తే మారుతి వెనుకబడ్డాడనే చెప్పాలి. మొదటి చిత్రం కళ్యాణ్‌రామ్‌తో ‘పటాస్’తో హిట్ కొట్టి, రెండో చిత్రం సాయిధరమ్‌తేజ్‌తో ‘సుప్రీం’ చేసి, మూడో చిత్రానికే మాస్ మహారాజా రవితేజ, దిల్‌రాజులను మెప్పించి ‘రాజా ది గ్రేట్’ ద్వారా సత్తా చాటిన అనిల్‌రావిపూడి నాలుగో చిత్రంతో ఏకంగా విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్‌లతో కనివిని ఎరుగని హిట్‌ని ‘ఎఫ్ 2’ ద్వారా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రం 130కోట్ల వరకు వసూలు చేసి సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
అదే మారుతి విషయానికి వస్తే అడల్డ్ కంటెంట్ చిత్రాల ద్వారా హిట్స్ కొట్టి, ఆ తర్వాత ‘ప్రేమకథాచిత్రమ్’తో హర్రర్ కామెడీ ట్రెండ్‌కి శ్రీకారం చుట్టాడు. ఇక నానితో ‘భలే భలే మగాడివోయ్’, శర్వానంద్‌లతో ‘మహానుభావుడు’ తర్వాత ‘శైలజ రెడ్డి అల్లుడు’తో ఢీలా పడ్డాడు. వెంకీతో ఆయన కూడా ఓ చిత్రం మొదలుపెట్టినా అది ఆగిపోయింది. కానీ అనిల్ రావిపూడి మాత్రం విక్టరీ వెంకటేష్‌ని మెప్పించడమే కాదు.. తన తదుపరి చిత్రం మహేష్‌బాబుతో చేయాలని భావిస్తున్నాడని తెలుస్తోంది. ఇదే జరిగితే మారుతి కన్నా ఫాస్ట్‌గా అనిల్ టాప్‌లీగ్‌లోకి చేరిపోవడం ఖాయమనే చెప్పాలి. నవ్వుని నమ్మి మోసపోయిన వాడు లేడని చెప్పిన రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు ఈ ఇద్దరికీ బాగానే సూట్ అవుతాయి. మరి రాబోయే చిత్రాలతోనైనా మారుతి తన సత్తా చాటి తాను కూడా స్టార్స్‌ని హ్యాండిల్ చేయగలనని నిరూపిస్తాడో లేదో వేచిచూడాల్సివుంది..!