అండర్ డాగ్ గా బరిలో దిగిన కన్నడ సినిమా `కేజీఎఫ్ చాప్టర్1`. రాక్‌స్టార్ యష్ ని కొత్తగా ఆవిష్కరిస్తూ అతని స్టామినాని పసిగట్టి ప్రశాంత్ నీల్ చేసిన సాహసం కేజీఎఫ్. ఇలాంటి సాహసోపేతమైన సినిమా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఆకట్టుకుంది అంటే దానికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ విజన్, హీరో యష్ ట్రెమండస్ పెర్ఫార్మెన్స్. రెండంకెల మార్కు కలెక్షన్‌లు దాటని యష్ నటించిన ఈ సినిమా ఏకంగా 225 కోట్లు వసూలు చేసి తనని పాన్ ఇండియా స్టార్‌ని చేసింది.
రాజమౌళి రూపొందించిన కలల సామ్రాజ్యం `బాహుబలి` తరువాత ఓ దక్షిణాది చిత్రం (2.ఓ మినహా) రెండు వందల కోట్ల పైచిలుకు వసూళ్లను సాధించడం ఈ సినిమాకే చెల్లింది. `బాహుబలి` తరహాలోనే ఈ చిత్రానికి దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండవ భాగాన్ని కూడా ముందే ప్లాన్ చేశాడు. `బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న తరహా ఆసక్తిని కలిగించకపోయినా రెండవ భాగం మాత్రం రసవత్తరంగా వుంటుందనే హింట్‌నిచ్చి తొలి భాగాన్ని ముగించాడు ప్రశాంత్ నీల్. త్వరలోనే ఈ చిత్ర చాప్టర్ 2 మొదలుకాబోతోంది. తొలి భాగాన్ని మించి చాప్టర్ 2 మరింత రంగు మారుతోందని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ భాగంలోని ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ బ్యాడ్‌మెన్ సంజయ్ దత్‌ని సంప్రదించిన చిత్ర బృందం తాజాగా మరో కీలక పాత్ర కోసం రవీనా టాండన్‌ను సంప్రదించారట. ప్రస్తుతం టాక్స్ జరుగుతున్నాయని, త్వరలోనే రవీనా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వబోతోందని చిత్ర బృందం వెల్లడించింది. ఇద్దరు బాలీవుడ్ నటులు, మరో ఇద్దరు తెలుగు, తమిళ నటులు నటించనున్న ఈ సినిమా ఊహించని స్థాయిలో అత్యంత భారీగా వుండేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారు. రవీనా టాండన్ 20 ఏళ్ల క్రితం కన్నడంలో ఉపేంద్ర నటించి `ఉపేంద్ర` సినిమాలో కనిపించింది. మళ్లీ ఇన్నేళ్ల విరామం తరువాత `కేజీఎఫ్ చాప్టర్ 2`తో మరో సారి కన్నడ ప్రేక్షకుల్ని పలకరించబోతోంది.