‘గీతాంజలి, శంకరాభరణం’ నుంచి గతంలో ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, చిరంజీవి వంటి వారు నటించిన ఎన్నో టైటిల్స్‌ని మనం తాజాగా వాడటం చూస్తూనే ఉన్నాం. కానీ తాజాగా నాని తన 24వ చిత్రంగా రూపొందనున్న మైత్రి మూవీ మేకర్స్-విక్రమ్ కె కుమార్‌ల చిత్రానికి ‘గ్యాంగ్‌లీడర్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. నిజానికి ‘గ్యాంగ్‌లీడర్’ చిత్రం 28 సంవత్సరాల ముందు వచ్చి చిరంజీవిని మెగాస్టార్‌ని చేసింది. కానీ నాటి నుంచి ఆ టైటిల్‌ని వాడుకునే ప్రయత్నం ఏ నిర్మాత చేయలేదు. అన్నదమ్ముల స్టోరీ కావడంతో ‘వినయ విధేయ రామ’కి కూడా ఇదే టైటిల్‌ని అనుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ చివరకు అంత తెగింపు చేయలేకపోయారు.
ఇక నాని చిత్రానికి ‘గ్యాంగ్‌లీడర్’ అని పెట్టడంతో మెగాభిమానులు మండిపడుతున్నారు. ఈ టైటిల్‌ని రామ్‌చరణో, బన్నీనో, ఇంకెవ్వరైనా మెగా కాంపౌండ్ హీరో పెట్టుకున్నా ఊరుకోమని, అలాంటిది ఏ సంబంధం లేని నాని ఈ టైటిల్‌ని పెట్టుకోవడం ఏమిటని విమర్శలు కురిపిస్తున్నారు. అయినా చిరంజీవిలానే స్వయం శక్తితో ఎదిగిన నాని వంటి వారు ఈ టైటిల్‌ని పెట్టుకుంటే ఇంత హంగామా ఎందుకు అనేది అర్ధం కావడం లేదు. ఇక ఇందులో ఐదుగురు మహిళల గ్యాంగ్‌కి నాని గ్యాంగ్‌లీడర్‌గా కనిపిస్తూ ఉంటాడట. ‘గ్యాంగ్‌లీడర్’ మీద ఎవ్వరికీ పేటెంట్ హక్కులు లేవు. కొన్ని ఏళ్ల పాటు పెట్టకూడదు గానీ ఆ తర్వాత ఆ టైటిల్స్‌ని పెట్టుకోవచ్చనే నిబంధన ఉంది. గతంలో చిరంజీవి కూడా ఎన్టీఆర్, ఏయన్నార్‌లు నటించిన ‘ఆరాధన’ నుంచి మరికొన్ని టైటిల్స్‌ని ఇలా వాడుకున్నవాడే కదా...!
ఇక నాని విషయానికి వస్తే ఆయన ఇలా పాత క్లాసిక్ టైటిల్స్‌ని వాడుకోవడం ‘గ్యాంగ్‌లీడర్’తో కలిసి ఆరోసారి. ఏయన్నార్ నటించిన ‘పిల్లజమీందార్’, నాగార్జున నటించిన ‘మజ్ను’, ఏయన్నార్ ‘దేవదాస్’, ఎన్టీఆర్, ఏయన్నార్‌లు కలిసి నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’, అర్జున్-శంకర్‌ల ‘జెంటిల్‌మేన్’ ఇలా పలు టైటిల్స్‌ని వాడుకుని ఉన్నాడు. ఇక గతంలో చిరంజీవి నటించిన ‘స్టేట్‌రౌడీ’ టైటిల్‌ని హీరో శివాజీ కూడా వాడుకున్న సంగతి తెలిసిందే. అయినా కేవలం టైటిల్ పెట్టుకున్నాడని నానిని టార్గెట్ చేయడం సరికాదు. సినిమాలో కంటెంట్ ఉంటే ఆడుతుంది.. లేదంటే లేదు. నిజానికి ఈ టైటిల్‌ని పెట్టుకోవడం నాని, విక్రమ్ కె.కుమార్ వంటి వారిపై అదనపుబరువు అయ్యే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి.