పిల్లికి చెలగాటం.. ఎలుకకి ప్రాణసంకటంలా మారింది క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ పరిస్థితి. అతి తక్కువ కాలంలోనే ఆయన నుంచి ‘కథానాయకుడు, మహానాయకుడు’ వంటి డిజాస్టర్స్, ‘మణికర్ణిక’ వంటి యావరేజ్ చిత్రాలు వచ్చాయి. ఈ మూడు ఆయనకున్న గుడ్‌విల్‌ని పోగొట్టాయి. ఇక వరుణ్‌తేజ్- ‘ఘాజీ’ సంకల్ప్‌రెడ్డిలతో ‘అంతరిక్షం’ అనే చిత్రాన్ని నిర్మిస్తే అది కూడా భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇండస్ట్రీలో టాలెంట్ కంటే హిట్సే ఎక్కువ మాట్లాడుతాయి. ఎవరికైనా హిట్సే ప్రామాణికంగా నిలుస్తాయి. నిజానికి ఈ మూడు చిత్రాలకు ముందు క్రిష్‌తో టై అప్ అవ్వాలని మహేష్‌బాబు-రామ్‌చరణ్-వరుణ్‌తేజ్-అల్లుఅర్జున్‌లు భావించారు.
సాధారణంగా ఒక చిత్రాన్ని ఒకేసారి ట్వీట్ చేసి బాగుంది అని చెప్పే సూపర్‌స్టార్ మహేష్‌బాబు ‘కథానాయకుడు’ అద్భుతంగా ఉందని రెండు సార్లు ట్వీట్ చేశాడు. ఇక ‘కంచె’ చిత్రం తర్వాత మెగా కాంపౌండ్ కూడా క్రిష్‌పై ఆశలు పెంచుకుంది. అల్లుఅర్జున్ అయితే క్రిష్‌తో ఓ విభిన్న చిత్రం చేయాలని ఆశపడ్డాడు. కానీ నేటి పరిస్థితుల్లో వీరెవ్వరు క్రిష్‌ని మరలా పిలిచి చాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇక క్రిష్ తన ఫస్ట్ ఫ్రేమ్ పతాకంపై రాజీవ్‌రెడ్డితో కలిసి టీవీ సీరియల్స్ నిర్మిస్తున్నాడు. త్వరలో ఆయన ఓ వెబ్‌సిరీస్‌ని కూడా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.
వరుసగా మూడు చిత్రాలు నిరాశపరచడంతో క్రిష్ కెరీర్ మరలా మొదటికి వచ్చిందనే చెప్పాలి. అందుకే ఆయన అందరూ కొత్త నటీనటులతో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక మణికర్ణికకి డైరెక్షన్ క్రెడిట్ విషయంలో ఈయనకు కంగనారౌనత్‌కి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. తాజాగా దీనిపై కంగనా స్పందిస్తూ క్రిష్‌పై తనకున్న కోపాన్ని మొత్తాన్ని వెల్లగక్కింది. ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్‌గా నిలిచింది. కనీసం కలెక్షన్లు కూడా రాలేదు. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్నాను. క్రిష్‌ని నమ్మి బాలయ్య తన చిత్రానికి అంత బడ్జెట్‌ని కేటాయించడం చూస్తే నాకు బాధగా ఉంది. బాలకృష్ణగారిని చూస్తే జాలేస్తుంది.
‘మణికర్ణిక’ చిత్రాన్ని కూడా మధ్యలో ఆపేశారు. దానిని నేను తిరిగి బాధ్యతలు చేపట్టి సినిమా విడుదలయ్యేలా చేసే సమయంలో క్రిష్ అండ్ వన్ పార్ట్ ఆఫ్ ది మీడియా మాపై కక్ష్య కట్టి నాపై గద్దల్లా దాడి చేసి నా రక్తం పీల్చాలని భావించారు. కాబట్టి వాళ్లని నేను ఇప్పుడు ప్రశ్నించే సమయం వచ్చింది. పెయిడ్ మీడియా క్రిష్‌తో కలిసి నాపై దాడి చేశారు. దానిని తలుచుకుంటేనే బాధగా ఉందని చెప్పుకొచ్చింది. ఇలా క్రిష్ అనుకోని విధంగా ప్రస్తుతం అందరికీ టార్గెట్ కావడం బాధపడాల్సిన విషయమే.