తెలుగులో అభిరుచి ఉన్న నిర్మాతగా, పంపిణీదారునిగా కూడా దిల్‌రాజుకి ఎంతో పేరుంది. అయితే ఇటీవల ఆయన తీసిన పలు చిత్రాలు, పంపిణీ చేసిన కొన్ని చిత్రాలు దారుణమైన నష్టాలను తెచ్చాయి. కానీ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘ఎఫ్ 2’ చిత్రంతో ఆ నష్టాలన్నింటిని దిల్‌రాజు పూడ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన పంపిణీ దారునిగా నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా, నివేదా థామస్, ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ షాలిని పాండేలు నటిస్తూ గుహన్ దర్శకత్వంలో రూపొంది విభిన్నమైన టైటిల్‌తో పాటు ప్రోమోలతో కూడా ఆకట్టుకుంటున్న ‘118’ రైట్స్‌ని దిల్‌రాజు కొనుగోలు చేశాడు. గతంలో కళ్యాణ్‌రామ్‌కి ఆఖరిగా వచ్చిన హిట్ ‘పటాస్’ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసింది దిల్‌రాజే కావడం విశేషం.
వాస్తవానికి దిల్‌రాజు ‘118’ షోకి హాజరయ్యే సమయంలో సినిమా బాగుంటే నైజాం హక్కులు మాత్రం తీసుకోవాలనుకున్నాడట. కానీ చిత్రం అంచనాలకు మించి ఉండటంతో ఆయన నైజాం, ఆంధ్రాతో పాటు సీడెడ్ హక్కులను కూడా అడిగాడని తెలుస్తోంది. కానీ అప్పటికే సీడెడ్ హక్కులు అమ్ముడు పోవడంతో నైజాం, ఆంధ్రా ఏరియాలను 7కోట్లు పెట్టి కొనేశాడట. అంతకు ముందే ఈ చిత్రం సీడెడ్ హక్కులు 2కోట్లకు అమ్ముడయ్యాయి. దీంతో థియేటికల్ రైట్స్ ద్వారానే 9కోట్లు వస్తే ఇతరమార్గాల ద్వారా మరో మూడు కోట్లు వసూలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక ఈ చిత్రాన్ని గుహన్ మొదట డార్క్ మూవీగా తెరకెక్కించాలని భావించాడట. కానీ నందమూరి కళ్యాణ్‌రామ్, నిర్మాత మహేష్ కోనేరుల సూచనల మేరకు దీనిని బ్రైట్ యాక్షన్ ఫిల్మ్‌గా తీర్చిదిద్దటం జరిగింది. ఇక ఈ చిత్రం కథ మొత్తం నివేదాథామస్ చుట్టూ తిరుగుతుంది. నివేదా పాత్ర మాత్రం ‘118’ అనే నెంబర్ చుట్టూ తిరుగుతుంది. ఇంతకీ ఆ ‘118’ అంటే ఏదో తెరపై చూడాలి. ఇక ఈ చిత్రం సోలోగా మార్చి 1న విడుదల కానుంది. ఈ చిత్రం షూటింగ్‌లో అర్జున్‌రెడ్డి ఫేమ్ షాలిని పాండే చేసిన అల్లరి అంతా ఇంతా కాదని కళ్యాణ్‌రామ్ చెబుతున్నాడు.
ఇక ఈ చిత్రం హీరోగా నందమూరి కళ్యాణ్‌రామ్‌కి, నిర్మాతగా మహేష్ కోనేరుకు, పంపిణీ దారునిగా దిల్‌రాజుకి ఎంతో కీలకం. అంతేకాదు.. హీరోయిన్ నివేదాథామస్‌కి, ‘అర్జున్‌రెడ్డి’ తర్వాత ‘మహానటి, కథానాయకుడు’ వంటి బయెపిక్స్‌లో నటించిన షాలిని పాండేకి ఎంతో కీలకం అని చెప్పాలి.