సాధారణంగా స్టార్ హీరోయిన్లకు పెళ్లి అయితే పేకప్ చెప్పాల్సిందే. వారిని హీరోలకు జోడీగా చూసేందుకు మన ప్రేక్షకులు ఇష్టపడరు. దాంతో ఏవో కథాప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనే కనిపిస్తూ ఉంటారు. కానీ అక్కినేని ఇంటి కోడలు సమంత తన రూటే సపరేట్ అని నిరూపిస్తోంది. వివాహం తర్వాత ఆమె నటించిన ప్రతి చిత్రంతోనూ ఆమె ప్రశంసలను చూరగొంది. ‘రాజు గారి గది2, మహానటి, రంగస్థలం, అభిమన్యుడు, యూటర్న్’ వంటి చిత్రాలతో ఈమె మెప్పించింది. కేవలం కథా ప్రాధాన్యం ఉన్న పాత్రలనే కాదు.. రామ్‌చరణ్‌కి జోడీగా ‘రంగస్థలం’, విశాల్‌తో ‘అభిమన్యుడు’ చిత్రాలు చేసింది. ఇక ఈమె తమిళంలో చేసిన ‘సూపర్‌డీలక్స్’ చిత్రం కాస్త ఆలస్యంగా విడుదలకు సిద్ద మవుతోంది. సమంత ఇందులో మటన్ కత్తి పట్టుకుని స్పెషల్‌గా కనిపిస్తుండగా, విజయ్ సేతుపతి ట్రాన్స్ జెండర్‌గానూ, రమ్యకృష్ణ పోర్న్‌స్టార్‌గాను నటిస్తున్నారని తెలుస్తోంది. తమిళంతో పాటు ఈ మూవీ తెలుగులో కూడా మార్చి29న విడుదల కానుంది.
మరోవైపు ఆమె వివాహానికి ముందు ‘ఏ మాయచేశావే, మనం, ఆటోనగర్ సూర్య’వంటి చిత్రాలలో నాగచైతన్య సరసన నటించింది. పెళ్లయిన తర్వాత మాత్రం ఆమె తొలిసారిగా తన భర్త చైతుతో ‘మజిలీ’ చిత్రం చేస్తోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా యూనిట్‌తో దిగిన ఫొటోలను సమంత, నాగచైతన్యలు సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. చైతు ట్రెండీ లుక్‌తో కనిపిస్తుంటే సమంత మాత్రం సింపుల్‌గా చుడీదారులో కనిపిస్తూ ఉండటం విశేషం. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి ఏప్రిల్ 5వ తేదీన ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఇందులో నాగచైతన్య క్రికెట్ ప్లేయర్ పాత్రను చేస్తుండగా, సమంత పాత్ర ఏమిటి? అనే విషయం ఆసక్తిని రేపుతోంది. డిసెంబర్31, మకర సంక్రాంతిలకు లుక్స్‌తోపాటు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా టీజర్‌ని విడుదల చేశారు.
ఈ టీజర్ ఇప్పటికే చైతు కెరీర్‌లోనే అత్యధికంగా 7.5 మిలియన్ల వ్యూస్‌ని సొంతం చేసుకుంది. ఇలా అతి తక్కువ గ్యాప్‌తో సామ్ నటించిన రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. మరోవైపు ‘అల్లుడుశీను’లో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన నటించిన సమంత త్వరలో ‘ఆర్‌ఎక్స్ 100’ దర్శకుడు అజయ్‌భూపతి దర్శకత్వంలో బెల్లంకొండ హీరోగా నటించే చిత్రంలో కూడా మరల ఆయనతో జోడీ కట్టనుందని తెలుస్తోంది. ఇక ‘మజిలీ’ విషయానికి వస్తే ఈ చిత్రం ద్వారా దర్శకుడు శివనిర్వాణ ద్వితీయ విఘ్నాన్ని అధిగమిస్తాడో లేదో వేచిచూడాల్సివుంది. ఎందుకంటే ఇటీవలే ‘తొలిప్రేమ’ దర్శకుడు వెంకీ అట్లూరి ద్వితీయ విఘ్నం దాటలేక ‘మిస్టర్ మజ్ను’తో దెబ్బతిన్నాడు.