సినిమా పరిశ్రమలో కొందరు మినహాయింపు గానీ మిగిలిన వారు మాత్రం ఒక్కసారి సీనియర్ స్టార్ సరసన నటిస్తే యంగ్‌స్టార్స్‌తో జత కట్టే చాన్స్‌ని మిస్ చేసుకుంటారు. నయనతార, అనుష్క, కాజల్ అగర్వాల్ వంటి కొందరు మాత్రమే ఈ మినహాయింపు కిందకు వస్తారు. ఇక ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో పెద్ద హిట్ అందుకున్న రకుల్ ప్రీత్‌సింగ్ తన సహ నటీమణులైన రాశిఖన్నా, రెజీనా వంటి వారి కంటే బాగా దూసుకెళ్లి టాప్ హీరోయిన్ స్థానాన్ని దక్కించుకుంది. దాదాపు తెలుగులో యంగ్‌స్టార్స్ అందరితో కలిసి నటించింది.
బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో ‘జయ జానకి నాయకా’, నాగచైతన్యతో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రాలలో నటించింది. కానీ కిందటి ఏడాది ఆమెకి తెలుగులో ఒక్క చాన్స్ కూడా రాలేదు. కోలీవుడ్‌పై దృష్టి పెట్టి అన్నదమ్ములైన సూర్య, కార్తిలను లైన్‌లో పెట్టింది. ‘ఖాకీ’ చిత్రంతో కార్తిని మెప్పించి, తాజాగా ‘దేవ్’లో మరోసారి జత కట్టింది. కానీ ఈ చిత్రం డిజాస్టర్ అయింది. అదేసమయంలో ఆమెకి బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో ‘జయ జానకి నాయకా’ తర్వాత మరో చాన్స్‌గా తమిళ సూపర్‌హిట్ మూవీ ‘రాక్షసన్’ లో అవకాశం వచ్చిందని వార్తలు వచ్చాయి. కానీ రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఆమెని తొలగించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇక ఈమె విక్టరీ వెంకటేష్, నాగచైతన్యలతో రూపొందనున్న మల్టీస్టారర్ చిత్రంలో చైతుతో ‘రారండోయ్ వేడుకచూద్దాం’ తర్వాత ‘వెంకీ మామ’లో అవకాశం లభించింది. బాబి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇంతలో ఆమెకి ‘మన్మథుడు2’లో నాగ్ సరసన నటించే అవకాశం లభించడం, వెంటనే ఆమె ఓకే చేయడం జరిగిపోయాయి. కానీ దీని వల్లనే తన కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందని ఆమె ఊహించలేకపోయింది. ఒకే సమయంలో తండ్రి నాగార్జునతో ‘మన్మథుడు2’, తనయుడు నాగచైతన్యకి జోడీగా ‘వెంకీమామ’ రెంటిలో నటిస్తే బాగుండదనే ఉద్దేశ్యంతో సురేష్‌బాబు, బాబీలు ‘వెంకీమామ’ నుంచి ఆమెని తప్పించారట.
నిజంగా యంగ్ హీరోలతో నటించేటప్పుడు సీనియర్‌స్టార్స్ విషయంలో ఆచితూచి ఉండాలి. కానీ రకుల్ ముందు ఆలోచన లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈమెకి ఇకపై సీనియర్ స్టార్స్ మాత్రమే దిక్కయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బోయపాటి శ్రీను-బాలయ్యల చిత్రంలో కూడా ఈమెనే నటించే అవకాశాలు ఉండటంతో ఇక మన సీనియర్ స్టార్స్‌కి రకుల్‌ప్రీత్‌సింగ్ రూపంలో మరో జోడీ దొరికిందనే చెప్పాలి.