దశాబ్దన్నరం ముందు తెలుగులో మంచి నటన, టాలెంట్, అందం అన్ని ఉన్న హీరోయిన్‌గా లయ మంచి పేరు తెచ్చుకుంది. విజయవాడకి చెందిన ఈమె తన నటనాసత్తాతో నాడు టాలీవుడ్‌ని ఏలుతోన్న పరభాషా హీరోయిన్లకు పెద్ద పోటీని ఇచ్చింది. ‘భద్రంకొడుకో’ చిత్రంతో బాలనటిగా పేరు తెచ్చుకుని, ‘స్వయంవరం’తో హీరోయిన్‌గా మారింది. ‘ప్రేమించు, దొంగరాముడు అండ్ పార్టీ, మనోహరం, మనసున్న మారాజు, కోదండరాముడు, దేవుళ్లు, మిస్సమ్మ, విజయేంద్రవర్మ, హనుమాన్‌జంక్షన్’ ఇలా పలు చిత్రాలలో పలువురు హీరోల సరసన నటించింది. 2006లో వివాహం చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. ఆ తర్వాత ఈమె ‘బ్రహ్మలోకం టు యమలోకం.. వయా భూలోకం’లో నటించింది. ఇటీవల ‘అమర్ అక్బర్ ఆంటోని’లో చిన్న పాత్రలో మెరిసింది. ప్రస్తుతం ఈమె మరలా సినీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది.
ఈ విషయంలో ఆమె మాట్లాడుతూ, కిందటి ఏడాది యంగ్‌టైగర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రంలో అవకాశం వచ్చింది. కానీ అది నాకు వయసుకి మించిన పాత్ర అనిపించడంతో నో చెప్పాను. నేను ఇంకా యంగ్‌గానే ఉన్నానని దర్శకులు, సన్నిహితులు అంటున్నారు. అందుకే తల్లి, వదిన వంటి పాత్రలకు నేను సూట్ కానని నిర్ణయించుకున్నాను. అలాంటి పాత్రల్లో నటించడానికి ఇంకా సమయం ఉంది. నాకు ఇటీవల కార్ యాక్సిడెంట్ అయిందని వార్తలు వచ్చాయి. నేను అమెరికాలో ఉంటే ఈ పుకార్లు ఇక్కడ రావడం నాకు అర్ధం కావడం లేదు.
ఇక కాస్టింగ్‌కౌచ్ విషయానికి వస్తే ఇది అన్ని రంగాలలో ఉంది. కానీ సినిమా వారినే మీడియా హైలెట్ చేస్తోంది. గ్లామర్ ఉన్న వారిపై ఇలా చేస్తున్నారు. ఇలా కథనాలు, వీడియోలు చేసి డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తున్నారు. ఇటీవల నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో నా తెలుగు బాగా లేదని విమర్శలు చేస్తున్నారు. చాలాకాలం అమెరికాలో ఉండటం వల్ల అలా జరిగి ఉండవచ్చు. ఎంత మంది తెలుగు బాగా మాట్లాడుతున్నారు? ఈ విషయంలో ఆడవారినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎంతో మంది హీరోలు కూడా తెలుగు బాగా మాట్లాడలేకపోతున్నారు. మరి వారి గురించి కూడా ఇలా రాయగలరా? సోషల్‌మీడియాలో మా ఫ్యామిలీ ఫొటోలు పెట్టాలంటేనే భయంగా ఉంది. వాటిని వాడుకునే ఏమేం రాస్తారో అని భయం వేస్తోందని చెప్పుకొచ్చింది. ఇందులో లయ చెప్పింది కూడా నిజమేనని ఒప్పుకోవాలి..!