సాధారణంగా ఎవరైనా స్టార్ కొత్త, నవతరం దర్శకులకు చాన్స్ ఇవ్వాలంటే భయపడతారు. కొత్తవారికి చాన్స్ ఇచ్చినా కూడా వారు చాలాకాలంగా తనతో పరిచయం ఉన్నవారినే ఎంచుకుంటారు. ఇతర సీనియర్ దర్శకులతో తాము చేసే సినిమాల సమయంలో దర్శకత్వ శాఖలో పనిచేసే టాలెంట్ ఉన్న కోడైరెక్టర్స్, అసోసియేట్స్, అసిస్టెంట్స్‌కి అలాంటి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. ఇక విషయానికి వస్తే యంగ్‌రెబెల్‌స్టార్ ప్రభాస్ తాను గతంలో పనిచేసిన స్టార్ దర్శకుల అసిస్టెంట్లకు చాన్స్‌లు ఇవ్వాలని భావిస్తున్నాడు. ‘బాహుబలి’ వంటి చరిత్ర సృష్టించిన చిత్రం తర్వాత ఆయన ఒకే ఒక్క చిత్రం అనుభవం ఉన్న సుజిత్‌తో 250కోట్ల బడ్జెట్‌లో రూపొందుతున్న ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇదే సమయంలో ‘జిల్’ వంటి సింగిల్ మూవీ ఎక్స్‌పీరియన్స్ ఉన్న రాధాకృష్ణతో మరో చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘జాన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఓ పీరియాడికల్ లవ్‌స్టోరీగా ఈ చిత్రం రూపొందుతుండగా, సుజీత్ చిత్రం హాలీవుడ్ యాక్షన్ చిత్రాల తరహాలో తెరకెక్కుతోంది.
ఇక ఈ రెండు చిత్రాల తర్వాత ప్రభాస్ ఎవరితో చిత్రం చేయనున్నాడు? అనేది ఆసక్తికరంగా మారుతోంది. గతంలో ప్రభాస్‌తో పూరీజగన్నాథ్ ‘బుజ్జిగాడు మేడిన్ చెన్నై, ఏక్‌నిరంజన్’ చిత్రాలు తీశాడు. ఇదే సమయంలో ఆయనకు పూరీ అసిస్టెంట్స్ మీద నమ్మకం ఏర్పడిందట. అదే విధంగా ‘మిర్చి’ షూటింగ్ సమయంలో కొరటాల అసిస్టెంట్స్‌లో ఆయన కొందరి ప్రతిభను చూసి ముచ్చటపడ్డాడని అంటున్నారు. అందుకే ప్రభాస్ ఎలానూ కొత్త తరం దర్శకులకు అవకాశాలు ఇస్తూ ఉండటంతో పూరీ, కొరటాల శిష్యులు ఎంతో మంది ప్రభాస్‌కి కథలు వినిపించి చాన్స్ దక్కించుకోవాలని భావిస్తున్నారు. ‘ఛత్రపతి, బాహుబలి’ సమయంలో రాజమౌళి శిష్యునిగా పనిచేసిన కృష్ణ అనే యువకుడు ప్రభాస్‌కి ఓ లైన్ చెప్పాడని సమాచారం. ప్రభాస్‌కి ఈ లైన్ బాగా నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్‌తో వస్తే యువి క్రియేషన్స్ బేనర్‌లోనే ఈచిత్రం చేద్దామని ప్రభాస్ మాట ఇచ్చాడని తెలుస్తోంది.
రాజమౌళి అద్భుత దర్శకుడే అయినా ఆయన శిష్యులెవ్వరూ ఇప్పటివరకు సొంతగా దర్శకులుగా రాణించిన చరిత్రలేదు. మరి కృష్ణ, ప్రభాస్ నమ్మకాలను ఎంత వరకు నిలబెడతాడో వేచిచూడాల్సివుంది...! మరోవైపు యష్ హీరోగా సంచలన ‘కేజీఎఫ్’ని తీసిన ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్‌తో చిత్రం చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. మరి ఈ ఒత్తిడి తాకిడిలో ‘సాహో’, ‘జాన్’ (వర్కింగ్‌టైటిల్) చిత్రాల తర్వాత ప్రభాస్ ఎవరితో చిత్రం చేయనున్నాడనేది ఆసక్తికరంగా మారింది.