ప్రస్తుతం డిజిటల్ ఫార్మెట్‌లో అమెజాన్ సంస్థ సంచలనాలు నమోదు చేస్తోంది. పలు భారీ నిర్మాణ సంస్థలు, స్టార్స్ కూడా దీనిపై మనసు పారేసుకుంటున్నారు. ఇక వెబ్‌సిరీస్‌ల హవా కూడా బాగా సాగుతోంది. రాజమౌళి విజన్‌ని నమ్మి ఆయనతో అన్ని కోట్లు బడ్జెట్ పెట్టి మరీ ఎన్నో ఏళ్లు వెయిట్ చేసి ‘బాహుబలి’ని తీసిన ఆర్కా మీడియా కూడా ప్రస్తుతం వెబ్‌సిరీస్‌లపై కన్నేసింది. ఇప్పటికే టివి రంగంలో ఉన్న ఈ సంస్థ పలు వెబ్‌సిరీస్‌ల నిర్మాణానికి సిద్దం అవుతోంది.
ఇక డిజిటల్ విప్లవం విషయానికి వస్తే ఇటీవల సంక్రాంతి కానుకగా వచ్చిన తెలుగు చిత్రాలైన ‘కథానాయకుడు’ని, మరీ ముఖ్యంగా ఇంకా థియేటర్లలో బాగానే కలెక్షన్లు వసూలు చేస్తోన్న దిల్‌రాజు, విక్టరీ వెంకటేష్, వరుణ్‌తేజ్‌ల ‘ఎఫ్2’లని కూడా అమెజాన్ సంస్థ డిజిటల్ స్ట్రీమింగ్‌లో ఉంచింది. మరికొన్ని రోజుల్లో ‘వినయ విధేయ రామ’ కూడా రానుంది. గతంలో దిల్‌రాజు మాట్లాడుతూ, ఇలాంటి డిజిటల్ ఫార్మాట్ వల్ల నిర్మాతలకు అదనపు ఆదాయ వనరు లభిస్తుందని కాబట్టి ఇందులో తప్పు పట్టాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పాడు.
అయితే ‘ఎఫ్2’ విషయంలో ఈ చిత్రం అర్ధశతదినోత్సం జరుపుకుని, ఇంత లాంగ్ రన్ ఉంటుందని బహుశా దిల్‌రాజు కూడా ఊహించి ఉండకపోవచ్చు. అదే తమిళ విషయానికి వస్తే శంకర్ దర్శకత్వంలో రజనీ, అక్షయ్‌కుమార్‌లు కలిసి నటించిన ‘2.ఓ’గానీ, ‘పేట’గానీ ఇప్పటివరకు డిజిటల్ ఫార్మెట్‌లో విడుదల కాలేదు. ఈ రెండు చిత్రాల హక్కులను కూడా అమెజాన్ సంస్థే దక్కించుకుంది.
బహుశా ఈ విషయంలో నిర్మాతలు ముందుగా అమెజాన్‌తో ఫుల్ రన్ పూర్తి కాకుండా డిజిటల్ ఫార్మాట్‌లో పెట్టకూడదని నిర్ణయం తీసుకుని ఉంటారని, అందువల్లే ‘2.ఓ, పేట’లు ఇంకా డిజిటల్‌లో రాలేదని అంటున్నారు. మరి ఇదే నిజమైతే తమిళ నిర్మాతలకు ఉన్న ముందు చూపు మన నిర్మాతలకు లేదనే చెప్పాలి. ఈ విషయంలో ఇకనైనా తెలుగు నిర్మాతలు కాస్త ముందుచూపుతో వ్యవహరిస్తే బాగుంటుందనే అభిప్రాయం మాత్రం సర్వత్రా వ్యక్తమవుతోంది.