ప్రస్తుతం రాజమౌళి అంటే కేవలం టాలీవుడ్‌లోనే కాదు దేశంలోని అన్ని భాషాచిత్రాల పరిశ్రమల్లో, విదేశీ భాషల్లో, బాలీవుడ్‌లతో సహా అన్ని వుడ్‌లలో గుర్తింపు ఉంది. చరిత్ర సృష్టించిన ‘బాహుబలి’ చిత్రం తర్వాత ఆయన చేయబోయే చిత్రంపై జాతీయ మీడియా కూడా కన్నేసింది. దేశం మొత్తం ఆయన తదుపరి చిత్రం వైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ‘బాహుబలి’ తదుపరి చిత్రంగా రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ని ప్రారంభించాడు. తెలుగులో చాలా ఏళ్ల తర్వాత అసలుసిసలు మల్టీస్టారర్‌గా, ఇద్దరు సమానమైన క్రేజ్, ఇమేజ్, ఏజ్ ఉన్న రామచరణ్, ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో అజయ్‌దేవగణ్ విలన్ పాత్రని లేదా కామియో పాత్రను చేస్తున్నాడని వార్తలు వచ్చాయి.
కానీ వాటిని తాజాగా అజయ్‌దేవగణ్ ఖండించాడు. శంకర్ ‘భారతీయుడు 2’ కోసం తనని అడిగిన మాట వాస్తవమేనని, కానీ రాజమౌళి మాత్రం ఇంకా తనని సంప్రదించలేదని ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ చిత్రంలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, వీరిలో ఇద్దరు భారతీయులు కాగా ఒక విదేశీ వనిత నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఇందులో ఓ హీరోయిన్‌గా అలియాభట్ ఖాయమైందని తెలుస్తోంది. త్వరలో అఫీషియల్ ప్రకటన కూడా రానుంది. ఇక రెండో హీరోయిన్‌గా పరిణితీ చోప్రా పేరు బాగా వినిపిస్తోంది.
ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు ఇద్దరు భారీ శరీరాలతో, కండలు తిరిగి, వస్తాదుల్లా కనిపించాల్సివుందట. ఇటీవలే ‘వినయ విధేయ రామ’ కోసం రామ్‌చరణ్ రాంబో లుక్‌లో మేకోవర్ అయ్యాడు. దాంతో రామ్‌చరణ్ అదే మేకోవర్‌లో ఇందులో కనిపించనున్నాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం ‘అరవింద సమేత వీరరాఘవ’ తర్వాత కాస్త బొద్దుగా తయారయ్యాడు. సో.. ఎన్టీఆర్‌కి మాత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ కోసం భారీగా కండలు పెంచి, వస్తాదులా మేకోవర్ కావాలని జక్కన్న కోరాడట. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న ఎన్టీఆర్ దీనిపైనే దృష్టిని సారించాడని తెలుస్తోంది.