శ్రీరాం, సంచితా పడుకొణే హీరోహీరోయిన్లుగా అసలేం జరిగింది సినిమా షూటింగ్ ప్రారంభమైంది. నమస్తే తెలంగాణ చీఫ్ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. క్రెడాయ్ జాతీయ మాజీ అధ్యక్షుడు సి.శేఖర్‌రెడ్డి క్లాప్ కొట్టారు. ఎక్సోడస్ మీడియా బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు కెమెరామన్ ఎన్‌వీఆర్ తొలిసారిగా దర్శకత్వ బాధ్యతల్ని చేపట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. కథను నెర్రపల్లి వాసు అందించారు. ముహుర్తపు షాట్‌ను హీరో శ్రీరాం, డ్యాన్సర్ల మీద చిత్రీకరించారు. ఈశ్వర్ ఈ సినిమా ద్వారా డ్యాన్స్ మాస్టర్‌గా పరిచయం అవుతున్నారు.
ఈ సందర్భంగా కట్టా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ నేపథ్యంలో ఒక సస్పెన్స్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నందుకు అభినందలు తెలిపారు. ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న కథాంశాన్ని ఎంచుకుని, ఆకర్షణీయమైన రీతిలో చిత్రీకరించే సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయన్నారు. అలాంటి కోవలోకే అసలేం జరిగింది సినిమా వస్తుందని తెలిపారు.
క్రెడాయ్ జాతీయ మాజీ అధ్యక్షుడు సి.శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలోని అందమైన లొకేషన్లలో సినిమా చేయడం స్వాగతించాల్సిన విషయమన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత కె. నీలిమా మాట్లాడుతూ.. తెలంగాణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుతున్నామని.. మే చివరిలోపు సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకర్ రెడ్డి, గిరిధారి హోమ్స్ ఎండీ ఇంద్రసేనారెడ్డి, బొమ్మారం గ్రామ సర్పంచి శంకర్, లక్ష్మారెడ్డి, పాస్టర్ ప్రేమ్ బాబు తదితరులు పాల్గొన్నారు.