ఒక్క స్టార్ హీరో చిత్రం బాగా ఆడిందంటే తదుపరి చిత్రాలకు భారీ డిమాండ్ ఏర్పడుతుంది. బయ్యర్లు వేలం వెర్రిగా ఎంతో పోటీ మధ్య ఆ చిత్రం హక్కులను దక్కించుకుంటూ ఉంటారు. ఈ విషయంలో నిర్మాతల కంటే బయ్యర్లదే తప్పు. నాన్‌రిఫండబుల్ రేట్లకు కూడా ఆ చిత్రం ఫ్లాప్ అయితే నష్టపరిహారం కోరుతూ ఉంటారు. తాజాగా ‘కథానాయకుడు’ డిజాస్టర్ అయిన నేపధ్యంలో మూడో వంతు నష్టాన్ని బాలయ్య స్వయంగా నష్టపోయిన బయ్యర్లకు ఇవ్వాలని, అలాగే ‘మహానాయకుడు’ని కూడా ‘కథానాయకుడు’ విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్లకే ఇచ్చి అందులో వచ్చే లాభంలో 40శాతం నష్టపోయిన బయ్యర్లకే ఇవ్వాలని నిర్ణయించాడు.
ఇక రామ్‌చరణ్-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఈ సంక్రాంతికే ‘కథానాయకుడు’తో పాటు ‘వినయ విధేయ రామ’ కూడా విడుదలైంది. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా కూడా ఈ చిత్రం 70శాతం వరకు రికవరీ చేసింది. అయితే ఈ చిత్రం ఫ్లాప్ విషయంలో రామ్‌చరణ్ ప్రేక్షకులకు క్షమాపణలు తెలుపుతూ ఓ లెటర్‌ని కూడా రాశాడు. నిర్మాత దానయ్యని, సాంకేతిక నిపుణులను వెనకేసుకుని వచ్చి, పనిలో పనిగా ఈ మూవీకి తాను తీసుకున్న రెమ్యూనరేషన్‌లో 5కోట్లు వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం పట్ల అందరు ఎంతగానో సంతోషించారు. మరో ఐదు కోట్లను దానయ్య బయ్యర్లకు ఇవ్వనున్నాడు.
అయితే ‘వినయ విధేయ రామ’ ఫ్లాప్ విషయంలో ఓపెన్‌గా లెటర్ రాయడం, బాగానే వసూలు చేసిన చిత్రం కోసం పారితోషికంలో 5కోట్లు వెనక్కి ఇవ్వడం పట్ల చరణ్‌పై చిరు అసహనాన్ని ప్రకటించాడట. ఇలా అలవాటు చేస్తూ పోతే ఫ్లాప్ వచ్చిన ప్రతిసారి నిర్మాతలు, బయ్యర్ల నష్టపరిహారం కోసం ఎదురు చూస్తూ ఉంటారని, కాబట్టి ఇలాంటివి ప్రోత్సహించవద్దని ఆయన చరణ్‌కి క్లాస్ పీకాడట. ఇక్కడ చిరు అలా ఆలోచించడంలో కూడా న్యాయం ఉంది. గతంలో చిరంజీవి తన డిజాస్టర్ చిత్రాల విషయంలో కూడా ఏనాడు మరలా తన పారితోషికాన్ని ఎదురు ఇచ్చిన దాఖలాలు లేవు. కేవలం రజనీకాంత్, పవన్‌కల్యాన్ వంటి వారు ఇలా చేస్తూ ఉంటారు.
ఇక చరణ్ కోణంలో చూస్తే తన వల్ల నష్టపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వడం నిజంగా ఆయన పెద్ద మనసుకు నిదర్శనం. చరణ్ విషయంలో చిరు మరీ ఓవర్‌గా ఆలోచిస్తున్నాడని కొందరు అంటున్నారు. ‘రంగస్థలం’ వంటి చిత్రాన్ని చేయడం సరికాదని చెప్పడం, ‘వినయ విధేయ రామ’ వంటి రొంపకొట్టుడు కథలను ఎంపిక చేయడం.. ఇలా చిరు ఇంకా 1980, 90ల కాలంలోనే ఇప్పటికీ ఉన్నాడనే విమర్శలు వస్తున్నాయి.