రామ్‌గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. సంచలనం కాని దాన్ని కూడా సంచలనంగా మార్చడంలో ఆయనను మించిన వాళ్లు లేరు. కోటికి కొబ్బరి చిప్పలా ఇప్పుడు తనకు `లక్ష్మీస్ ఎన్టీఆర్` దొరికింది. ఇక నా సామిరంగ దున్నేస్తా సుబ్బరంగా అంటూ కదనోత్సాహంతో దూకేయడూ. వర్మ ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఎన్టీఆర్ జీవితంలో అత్యంత వివాదాస్పదమైన ఘట్టాన్ని ప్రధాన కథగా తీసుకుని వర్మ చేస్తున్న `లక్ష్మీస్ ఎన్టీఆర్` ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా ప్రచారం కోసం ఎవ్వరినీ వదలడం లేదు వర్మ. ఇటీవల గుంటూరు వచ్చిన ప్రధాని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వెన్నుపోటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
వాటిని కూడా తన సినిమా పబ్లిసిటీకి వాడుకుంటూ ప్రధాని నా సినిమాకు ప్రచారం చేస్తున్నాడని ట్విట్టర్‌లో ప్రకటించాడు. అదంతా అంతా వర్మ చేస్తున్న ట్విట్టర్ హడావిడి అనుకున్నారంతా. అయితే అది హడావిడి కాదు నిజమేనంటూ సరిగ్గా గంట క్రితం లక్ష్మీపార్వతి సాక్షాత్తు ప్రధాని మోదీని కలిసి మాట్లాడుతున్న ఓ ఫోటోని ట్విట్ చేస్తూ దానికి `డస్కసింగ్ `లక్ష్మీస్ ఎన్టీఆర్`అనే ట్యాగ్ లైన్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తను మాట వరసకు ప్రధాని మోదీ మా సినిమాకు ప్రచారం చేస్తున్నాడని అనలేదని, ఆయన నిజంగానే మా చిత్రానికి ప్రచారం చేయబోతున్నారని, ఎన్ని అడ్డంకులు వచ్చినా మా చిత్రానికి అండగా నిలవబోతున్నారనే అర్థం వచ్చేలా తాజా ట్వీట్ చేయడం సర్వత్రా సంచలనం సృష్టిస్తోంది.
అన్నట్టు బాలకృష్ణ నటిస్తున్న `ఎన్టీఆర్ మహానాయకుడు` విడుదల తేదీ ప్రకటించిన వెంటనే `లక్ష్మీస్ ఎన్టీఆర్` విడుదల తేదీని ప్రకటిస్తానని ప్రకటించిన వర్మ ఈ నెల 14న టీజర్‌ను, ఈ నెల 22న విడుదల కాబోతున్న `ఎన్టీఆర్ మహానాయకుడు`తో పాటు `లక్ష్మీస్ ఎన్టీఆర్` ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నాడు.