ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆంటీ అనసూయకు టాలీవుడ్‌లో ఉన్న ఫాలోయింగ్ సామాన్యం కాదు. ఈమె కెరీర్ సాక్షి చానెల్‌తో మొదలైంది. ఆ తర్వాత వేరే చానెల్స్‌కి వచ్చి ఎంటర్‌టైన్‌మెంట్ బేస్‌డ్ ప్రోగ్రామ్‌ల ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈటీవీ ‘జబర్దస్త్’ ఈమెకి స్టార్ స్టేటస్‌ని తెచ్చిపెట్టింది. పెళ్లి కాని రష్మి కంటే అనసూయకే నేడు ఎక్కువ క్రేజ్ ఉందనేది వాస్తవం. అతి తక్కువ కాలంలోనే ‘క్షణం, రంగస్థలం’ వంటి చిత్రాల ద్వారా మెప్పించింది. అతి కొద్ది సమయంలోనే ఏకంగా తనపేరు మీదనే ఐటం సాంగ్ రాసి, దానిలో ఆడిపాడే చాన్స్‌ని కొట్టేసింది.
ఇక విషయానికి వస్తే తాజాగా విడుదలైన వైఎస్‌ఆర్ సెమీ బయోపిక్ ‘యాత్ర’లో ఆమె గౌరు సుచరితారెడ్డి పాత్రలో చిన్న పాత్ర ద్వారానే తన సత్తా చాటింది. వైఎస్‌ఆర్ పాత్రధారి మమ్ముట్టి ఎంట్రీ కూడా ఈమె ద్వారానే జరగడం ఆమె వేసిన చిన్నపాత్రకి ఉన్న ప్రత్యేకతను చాటింది. ప్రత్యర్ధి కూతురిగా వచ్చి రౌడీలు ఎటాక్ చేయబోతే రాజన్న వాహనం చూపి వెళ్లిపోయే పాత్రలో చక్కగా ఒదిగిపోయింది.
ఇప్పటికే ఈ సీన్‌కి సంబంధించిన ‘గడపలోకి వచ్చిన ఆడకూతురితో రాజకీయమేంది?’ అనే డైలాగ్ బాగా పేలింది. తాజాగా అనసూయ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ, నాకు సుచరితా రెడ్డి పాత్రను ఇచ్చిన దర్శకుడు మహి.వి.రాఘవ గారికి కృతజ్ఞతలు. వైఎస్‌ఆర్ పాత్రధారి ది లెజెండ్ మమ్ముట్టి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మమ్ముట్టి సార్ వైఎస్‌ఆర్ పాత్రను పోషించినందుకు ఆయనకు కృతజ్ఞతలు. ఈ సినిమాతో మమ్ముట్టి సార్ వైఎస్‌ఆర్ బతికున్న రోజులని గుర్తుకు తెచ్చారు. ఇకపై ‘యాత్ర’ చూసిన ప్రతి సారి వైఎస్‌ఆర్ నాటి రోజులు గుర్తుకు వస్తాయి... అని పేర్కొంది.
నిజానికి రంగమ్మత్త పాత్ర, సుచరితా రెడ్డి పాత్రలు రెండు వేటికవే ఎంతో విభిన్నమైనవి. నిజానికి చిన్న పాత్రే అయినా ‘యాత్ర’లోని ఆమె పాత్ర ఆమెకి జీవితాంతం గుర్తిండిపోయేలా, ఆమె సత్తాని చాటేలా ఉండటంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి.