సాంకేతిక విప్లవం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయనేది వాస్తవం. ఇది సినీ పరిశ్రమ విషయంలో నిత్యం నిరూపితం అవుతూనే ఉంది. ఎంతో సీక్రెట్‌గా సినిమాలు తీయాలని చూసినా, ఒకే ఒక్క లీక్ ఫొటోతో క్లూ వచ్చేస్తోంది. దాంతో ఇప్పటికే బాగా తెలివిమీరిన సినీ ప్రేమికులు ఆ చిత్రం ఏ జోనర్‌లో రూపొందుతోంది? దాని నేపధ్యం ఏమిటి? వంటివి ఈజీగా ఊహించేస్తున్నారు.
ఇక విషయానికి వస్తే ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా అందరూ ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి తీసే చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’పై దృష్టి కేంద్రీకరించారు. ఈ మూవీ గురించి చిన్న విషయం బయటకు పొక్కినా కూడా క్షణాలలో దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అందునా జక్కన్న తీసే చిత్రాలు భారీగా, వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులు, వందలాది మంది యూనిట్‌తో ఉంటాయి. ఆధునిక కెమెరాలు రావడంతో ఫొటోలు లీక్ కాకుండా ఎంత కఠిన నిబంధనలు పెట్టినా అవి బయటకు వస్తూనే ఉన్నాయి.
ఇక తెలుగులో నేటితరం యంగ్‌స్టార్స్‌లో సమానమైన ఇమేజ్ ఉన్న అసలు సిసలు మల్టీస్టారర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే ఇందులో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ సంచలనం అలియాభట్‌ని ఎంపిక చేశారని, జూనియర్ ఎన్టీఆర్ సరసన ఓ బ్రిటిష్ యువతిని పరిచయం చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇక ఈ చిత్రం కథానేపధ్యం బ్రిటిష్ కాలంతో పాటు నేటి వర్తమానానికి కూడా ముడి పడి ఉంటుందని, ఇది కూడా ‘మగధీర’ టైప్‌లోనే పూర్వజన్మల కథ అని ప్రచారం ఉంది.
అయితే వర్తమానం సంగతేమో గానీ బ్రిటిష్ కాలం నాటి నేపధ్యంలో ఇందులో ఉండనుందని తాజాగా నిరూపితం అయింది. లీక్ అయిన ఓ ఫోటోలో బ్రిటిష్ కాలం నాటి పోలీస్‌స్టేషన్ సెట్, బయట బ్రిటిష్ జెండా, జూనియర్ ఆర్టిస్టులు కూడా నాటి కాలం నాటి డ్రస్సులతో కనిపిస్తున్నారు. ఈ వార్తతో ఇంతకాలం సాగిన ప్రచారంలో ఓ భాగం నిజమేనని అర్ధమవుతోంది. మరి దానికి వర్తమానాన్ని కూడా కలుపుతారో లేదో వేచిచూడాల్సివుంది!