ఇటీవల వచ్చిన బహుభాషా చిత్రం ‘కేజీఎఫ్’ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ చిత్రం కన్నడ సినీ పరిశ్రమ రూపురేఖలను మార్చే చిత్రంగా పలువురు అభివర్ణిస్తూ ఉన్నారు. ఎందుకంటే టాలీవుడ్ సత్తాని రాజమౌళి-ప్రభాస్‌ల ‘బాహుబలి’ దేశవిదేశాలకు ఎలా తెలిపిందో.. కన్నడ పరిశ్రమ గట్స్‌ని ‘కేజీఎఫ్’ నిరూపించింది. కేవలం కన్నడలో మాత్రమే కాస్తోకూస్తో గుర్తింపు ఉన్న హీరో యష్ ఈ చిత్రంతో నేషనల్ స్టార్ అయిపోయాడు. ఇంతకాలం కన్నడ చిత్రాలంటే వాసిలోనూ, రాసిలోనూ అన్ని విధాలు తీసికట్టు అనే అపప్రధ ఉంది. దానికి ‘కేజీఎఫ్’ చెరిపేసింది.
కన్నడ నాటి ‘బాహుబలి’ రికార్డులను తిరగరాయడం, బాలీవుడ్‌లో సైతం షారుఖ్ ‘జీరో’కి సైతం దడ పుట్టించే కలెక్షన్లు సాధించింది. కోలార్ బంగారు గనుల్లో పనిచేసే మాఫియా వారసత్వం అనే పాయింట్‌కి యష్ సరిగా సూట్ కావడంతో ప్రస్తుతం దేశంలో యష్, దర్శకుడు నీల్‌ల పేర్లు మారుమోగుతున్నాయి. కానీ దీనిని ఓ ఫ్రాంచైజీగా తీయాలని దర్శక నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు.
‘కేజీఎఫ్’ చాప్టర్1 తర్వాత చాప్టర్2ని స్టార్ట్ చేస్తున్నారు. నిజానికి మొదటి చాప్టర్‌లోనే విలన్ పాత్రకు అమితాబ్, సంజయ్‌దత్ వంటి వారిని అడిగారని, కానీ వారు నో చెప్పారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే యష్ అనే హీరో ఎవరో కూడా నాడు వారికి సరిగా తెలియకపోయి ఉండవచ్చు. కానీ మొదటి చాప్టర్ ఇచ్చిన నమ్మకంతో తాజాగా ఇందులో విలన్ పాత్రను చేయడానికి బాలీవుడ్ స్టార్, ఖల్‌నాయక్ సంజయ్‌దత్ ఓకే చెప్పాడని ఏకంగా యషే అఫీషియల్‌గా కన్‌ఫర్మ్ చేస్తున్నారు.
నిజానికి ‘బాహుబలి’ మొదటి భాగం విషయంలో కూడా అది ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఎవ్వరూ భావించలేదు. దాంతో రెండో పార్ట్‌ని మరింత స్టార్ క్యాస్టింగ్‌తో అద్భుతంగా తీశారు. అదే దారిలో కేజీఎఫ్ పయనిస్తోంది. కేవలం సంజయ్‌దత్‌ని మాత్రమే కాదు.. ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా మంచి గుర్తింపు ఉన్న వారిని చాప్టర్2లో ఎంచుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు.
మొత్తానికి ‘కేజీఎఫ్’ చాప్టర్2 విషయంలో దర్శకనిర్మాతలు ‘బాహుబలి’లా జాగ్రత్తలు, స్పెషల్ అట్రాక్షన్స్ జోడు చేస్తే రాబోయే రోజుల్లో టాలీవుడ్, కోలీవుడ్‌ల తరహాలోనే ‘శాండల్‌వుడ్’లో కూడా భారీ చిత్రాలు, బహుభాషా చిత్రాల ఊపు వచ్చే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక సంజయ్‌దత్ విషయానికి వస్తే ఆయన చాలా ఏళ్ల కిందట కృష్ణవంశీ-నాగార్జున-రమ్యకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన ‘చంద్రలేఖ’ చిత్రంలో అతిధి పాత్రలో కనిపించాడు.