`కేజీఎఫ్ చాప్టర్-1` కన్నడ హీరో యష్‌ని రాత్రికి రాత్రే క్రేజీ స్టార్‌ని చేసింది. యష్ నటనకు ప్రశాంత్ నీల్ దర్శకత్వ ప్రతిభ తోడవడంతో ఈ సినిమా ఊహించని స్థాయిలో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కన్నడ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా ఈ శుక్రవారంతో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఊహించని స్టార్‌తో సినిమా చేసి అతనికి స్టార్‌డమ్‌ని తెచ్చిపెట్టిన దర్శకుడు ప్రశాంత్ నీల్‌కిది రెండవ సినిమా. పిరియాడిక్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు 225 కోట్లు వసూలు చేసి బాహుబలి తరువాత దక్షిణాది చిత్రాల్లో అత్యధిక కలెక్షన్‌లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇక కన్నడ చిత్రాల్లో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించి అగ్రభాగాన నిలిచింది.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్లకు మించి వసూలు చేసి ట్రేడ్ పండితుల్ని విస్మయపరిచిన ఈ చిత్రం సొంత రాష్ట్రం కర్ణాటకలో 14 కోట్లకు మించి వసూలు చేసింది. ఇక బాలీవుడ్ లో 70 కోట్లు వసూలు చేసి స్టిల్ డిమాండ్‌తో రన్ అవుతుండటం బాలీవుడ్ వర్గాలని షాక్‌కు గురిచేస్తోందట. `బాహుబలి` తరువాత బాలీవుడ్ బాక్సాఫీస్‌ని కొల్లగొట్టిన సినిమాగా `కేజీఎఫ్` రికార్డు సాధించడం పట్ల చిత్ర వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో 5.75 కోట్లు సొంతం చేసుకుంది. అండర్ డాగ్ గా వచ్చిన ఈ సినిమా అనూహ్యంగా 225 కోట్లు సాధించడం ఎవరికీ అంతుచిక్కడం లేదు.
కాగా తొలి చాప్టర్‌కు వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని చాప్టర్-2ను దర్శకుడు ప్రశాంత్ నీల్ మరింత భారీగా ప్లాన్ చేస్తున్నాడు. కీలకమైన విలన్ పాత్ర కోసం ఇప్పటికే బాలీవుడ్ బ్యాడ్‌మెన్ సంజయ్‌దత్‌ను ఎంపిక చేసుకున్న ప్రశాంత్ నీల్ మరో రెండు కీలక పాత్రల కోసం రమ్యకృష్ణ, ఇషా గోప్పకర్‌ను ఫైనల్ చేసేశాడు. తొలి భాగం ని మించి మరింత ఆసక్తికరంగా తెరపైకి రాబోతున్న చాప్టర్-2 రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతున్నట్లు కన్నడ చిత్ర వర్గాల సమాచారం.