సూపర్‌స్టార్ కృష్ణ ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించినా, టాలీవుడ్‌లో మొదటి కౌబోయ్, గూఢచారి పాత్రను పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. హాలీవుడ్ హిట్ ఫార్ములాలను కె.యస్.ఆర్.దాస్ వంటి వారితో ఈయన మెప్పించారు. ఆ తర్వాత ఆయన వారసుడైన మహేష్‌బాబు కూడా ‘టక్కరిదొంగ’లో తండ్రిని అనుసరించినా పెద్దగా విజయం సాధించలేకపోయాడు. దాంతో తానే హీరోగా కౌబోయ్, గూఢచారి పాత్రలు చేయడం కంటే తన సొంత నిర్మాణంలో ఇలాంటి చిత్రం తీయాలని మహేష్ డిసైడ్ అయ్యాడనేది తాజా సమాచారం. ప్రస్తుతం మహేష్ సినిమాలు, బ్రాండ్ అంబాసిడర్స్, యాడ్స్ ద్వారా రెండు చేతులా సంపాదిస్తున్నాడు.
ఇక ‘ఎం.బి’ బేనర్‌ని స్థాపించి, ‘శ్రీమంతుడు, బ్రహ్మూెత్సవం’ చిత్రాలకు నిర్మాణభాగస్వామిగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన వెబ్‌సిరీస్‌లోకి కూడా అడుగుపెడుతున్నాడని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఎనిమిది ఎపిసోడ్స్‌గా రూపొందనున్న ‘చార్లీ’ అనే ఈ వెబ్‌సిరీస్‌ని మహేష్ శ్రీమతి నమ్రతా పర్యవేక్షకురాలిగా ఉంటుందని, ‘నాన్నకు ప్రేమతో’ వంటి చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో వహిస్తాడని తెలుస్తోంది. కానీ ఇది బాగా ఆలస్యం అవుతోంది. కారణాలు తెలియడం లేదు గానీ, ఈ వెబ్‌సిరీస్ ద్వారా కొత్త హీరోని పరిచయం చేయాలని దర్శకుడు భావిస్తుండగా, తన అన్నయ్య రమేష్‌బాబు కుమారుడిని గానీ, లేదా తన మేనల్లుడిని గానీ ఈ వెబ్‌సిరీస్ ద్వారా పరిచయం చేసే వీలుందని అంటున్నారు. అయినా వెండితెరకి పరిచయం చేయకుండా వెబ్‌సిరీస్ ద్వారా వారిని పరిచయం చేయవద్దని ఒత్తిళ్లు వస్తున్నాయట.
ఇక మల్టీప్లెక్స్‌ల నిర్మాణంలోకి కూడా దిగిన మహేష్ తన సొంత బేనర్‌లో త్వరలో ఓ చిత్రాన్ని తీయనున్నాడట. ఇందులో అడవి శేషు హీరోగా నటించనున్నాడని సమాచారం. ‘క్షణం, గూఢచారి’ చిత్రాల ద్వారా మెప్పించిన అడవి శేష్ ప్రస్తుతం ‘2 స్టేట్స్, గూఢచారి 2’లతో బిజీగా ఉన్నాడు. ఇక ఇటీవల ఆయన నెలాఖరులో ఓ గుడ్ న్యూస్ చెబుతానని సోషల్‌మీడియా ద్వారా తెలిపాడు. అది పెళ్లి గురించా? అని కొందరు అడిగితే ఆయన సీరియస్ ఎమోజీలు పెట్టాడు. కాబట్టి ఆ గుడ్‌న్యూస్ పెళ్లికి సంబంధించినది కాదని, మహేష్ బేనర్‌లో మొదటి హీరోగా తానే నటించనున్నాడనే విషయమే ఆ గుడ్‌న్యూస్ అయి ఉంటుందని అంటున్నారు. కాగా మహేష్ బేనర్‌లో అడవిశేషు నటించే చిత్రానికి కూడా ‘గూఢచారి’ ఫేమ్ శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించే అవకాశం ఉంది.