రచయితలుగా పరుచూరి బ్రదర్స్‌ది దశాబ్దాల అనుభవం. వారు ఎన్నో రాజకీయ చిత్రాలకు కూడా రచయితలుగా పనిచేశారు. నాడు స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆయన ప్రసంగాలను ఉద్వేగ భరితంగా, ప్రజల మనస్సులోకి సూటిగా దూసుకుపోయేలా చేసింది కూడా పరుచూరి బ్రదర్సేనని అంటారు. దాసరితో సరిసమానమైన సేవను వారు ఎన్టీఆర్‌కి అందించారు. ‘రాజకీయం’ అనే పదానికి రాక్షసం జనాలకు కీడు చేసే యంత్రాంగంగా పేర్కొంది కూడా వారే. ఇక చిరంజీవి ప్రజారాజ్యం సమయంలో కూడా వీరి సలహాలు, సూచనలు తీసుకున్నాడు.
తాజాగా పరుచూరి గోపాలకృష్ణ పవన్ ఆవేశంలో, ఆవేదనతో మాట్లాడే మాటల్లోని ఓ తప్పు పదాన్ని కరెక్ట్‌గా క్యాచ్ చేశారు. పవన్ అంత:ర్ముఖుడు. ఆయనకు ఆవేశం వచ్చిందంటే మాత్రం ఆయన ప్రసంగాలలో తప్పులు దొర్లుతూ ఉంటాయి. రాజకీయ నాయకులకు ఉండాల్సింది విజనే గానీ ఆవేశం కాదనేది పవన్ ఇంకా గ్రహించినట్లు లేదు.
ఇక తాజాగా పరుచూరి గోపాలకృష్ణ పవన్ గురించి మాట్లాడుతూ, పవన్‌కి లక్షల్లో అభిమానులు ఉన్నారు. అలాంటి అభిమానుల్లో నేను కూడా ఒకడిని. పవన్ నటన అన్నా, వ్యక్తిత్వమన్నా నాకెంతో ఇష్టం. అందుకే ఆయన గురించి మాట్లాడాలనిపించింది. భగవంతుడు ఓ బంగారు తివాచి వేసి.. దీనిపై నడుచుకుంటూ వెళ్లు నాయనా అంటే జనం కోసం దాని పక్కకి వచ్చి ముళ్లు గుచ్చుకుంటాయో, రాళ్లుగుచ్చుకుంటాయో ఆలోచించకుండా ముందుకు వెళ్తున్నాడు. ఇలాంటి పనులు అందరు చేయలేరు. మొన్నీ మధ్య ఆయన తన ఆవేదన వ్యక్తం చేస్తూ, బాధేస్తోంది.. భయమేస్తోంది.. విసుగేస్తోంది అనే మూడు మాటలు వాడాడు.
జనాలకు ఏమవుతుందోనని బాధ ఉండాలి. నా ప్రజలకు ఏం జరుగుతుందో అనే భయం కూడా రాజకీయ నాయకులకు ఉండాలి. కానీ పవన్ ‘విసుగేస్తోంది’ అనే మాటను మాత్రం వాడకూడదు. ఎందుకంటే విసుగొచ్చేలా చేయడమే రాజకీయం. పవన్.. నీవు ఈ మార్గంలోకి ప్రేమించి వెళ్లావు... ఏమీ ఆశించి వెళ్లలేదు. అందువల్ల నువ్వు విసుగొస్తోంది అనే మాటను వాడకూడదు. అనుకున్నది సాధించే వరకు పోరాడుతూనే ఉండాలి’ అని తెలిపాడు. ఇందులో పవన్ గురించి కాస్త భజన ఉందనేది నిజమైనా పరుచూరి పాయింట్‌లో క్లారిటీ ఉందని ఒప్పుకోవాలి.