తిరుపతిలో ఇటీవల నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆయన ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన మాతృమూర్తి సోమారం ఉదయం కన్నుమూశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సొంతూరు నెల్లూరు అన్న విషయం తెలిసిందే. ఆయన చెన్నైకి మకాం మార్చినా అతని తల్లిదండ్రులు చాలా కాలంగా నెల్లూరులోనే వుంటున్నారు. దాదాపు అన్నిభాషల్లో గాన గాంధర్వుడిగా పేరుతెచ్చకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తల్లి శకుంతలమ్మ (89) సోమవారం ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నఆమె సోమవారం ఉదయం నెల్లూరులోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు.
ప్రస్తుతం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లండన్‌లో వున్నారు. ఓ సంగీత కార్యక్రమం నిమిత్తం లండన్ వెళ్లిన ఆయన తల్లి మరణవార్త తెలిసిన వెంటనే హుటా హుటిన ఇండియా బయలు దేరారని తెలిసింది. ఈ రోజు(సోమవారం) సాయంకాలానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నేరుగా నెల్లూరుకు చేరుకుంటారని, ఆ తరువాతే ఆయన తల్లి అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం బాలు నెల్లూరు చేరుకుంటారు. ఆయన చేరుకునే సరికి రాత్రి అయ్యే అవకాశం వుంది కాబట్టి శకుంతలమ్మ అంత్యక్రియలు మంగళవారం నెల్లూరులో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. బాలు తల్లి మృతిపట్ల పలువురు దక్షిణాతి చలన చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు