దేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడిగా ఎ.ఆర్.రెహ్మాన్ పేరునే ముందు చెప్పాలి. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకే కాదు... దేశవిదేశాలలో ఈయనకు ఎంతో గొప్ప పేరుంది. ఇళయరాజా హవా తగ్గిన రోజుల్లో మణిరత్నం ఈయనను పరిచయం చేశాడు. ఆ తర్వాత ది గ్రేట్ మణిరత్నం చిత్రాలకు, దిగ్గజ దర్శకుడు శంకర్ చిత్రాలకు ఈయన ఆస్థాన సంగీత విద్వాంసుడు అయ్యాడు. అయితే తెలుగులో మాత్రం రెహ్మాన్ సంగీతం అందించిన ఏ చిత్రం కూడా హిట్టు కాలేదు. దాంతో టాలీవుడ్‌లో ఆయనకు ఐరన్‌లెగ్ అనే ముద్రపడింది.
ఇక శంకర్ తన మొదటి చిత్రం ‘జెంటిల్‌మేన్’ నుంచి ‘2.ఓ’ వరకు రెహ్మాన్‌నే పెట్టుకున్నాడు. మధ్యలో రెహ్మాన్ బిజీగా ఉండటంతో ‘స్నేహితుడు, అపరిచితుడు’ చిత్రాలకు మాత్రం హరీష్‌జైరాజ్‌ని తీసుకున్నాడు. ఇలాంటి సమయంలో శంకర్ తన తాజాగా చిత్రంగా కమల్‌హాసన్ హీరోగా తీస్తున్న ‘భారతీయుడు2’ నుంచి రెహ్మాన్‌ని తొలగించి, అనిరుధ్‌ని పెట్టుకోవడం చర్చనీయాంశం అయింది.
శంకర్ చిత్రాలు మూసగా ఉండడం వల్లే రెహ్మాన్ ఈ చిత్రాన్ని వదులుకున్నాడని, కాదు.. కాదు.. ఇటీవల కాలంలో రెహ్మాన్ నాసిరకం సంగీతం అందిస్తూ ఫామ్ కోల్పోవడం వల్లే శంకర్ ఆయనను దూరం పెట్టాడనే రెండు విభిన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా దీనిపై రెహ్మాన్ స్పందించాడు.
ఆయన మాట్లాడుతూ.. ‘భారతీయుడు2’కి కమల్‌హాసన్ ఆప్షన్ నేనే. కానీ శంకర్ మాత్రం అనిరుధ్‌ని తీసుకున్నాడు. ‘2.ఓ’కి నేను బాగా అలిసిపోయాను. అందుకే నాకు విశ్రాంతిని ఇచ్చేందుకే అనిరుధ్‌ని పెట్టుకుని ఉంటారు అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ చిత్రాన్ని రెహ్మాన్ వద్దనుకోలేదని, శంకరే ఆయనను పక్కన పెట్టి అనిరుధ్‌ని తీసుకున్నాడనే విషయం రెహ్మాన్ మాటల ద్వారా స్పష్టం అవుతోంది.