కింగ్ నాగార్జున తన సినీ కెరీర్, బిజినెస్‌లు, మరోవైపు స్టూడియో, కుమారుల కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేయడం.. ఇలా బహుముఖ పాత్రలను పోషిస్తున్నాడు. కానీ ఇటీవల ఆయన నటించిన ‘ఆఫీసర్, దేవదాస్’ వంటి చిత్రాలు సరిగా ఆడలేదు. మరోవైపు నాగచైతన్య, అఖిల్‌లకి కూడా చెప్పుకోదగ్గ హిట్స్ ఇవ్వలేకపోతున్నాడు. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ తర్వాత నాగచైతన్య ‘శైలజారెడ్డి అల్లుడు, సవ్యసాచి’ చిత్రాల ద్వారా నిరాశపరిచాడు. మరోవైపు అఖిల్ తన మొదటి చిత్రం ‘అఖిల్’తో దెబ్బతినడంతో ఇంటెలిజెంట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకుని తమ ఫ్యామిలీకి ‘మనం’ వంటి క్లాసిక్‌ని ఇచ్చిన విక్రమ్ కె.కుమార్‌తో తన బేనర్‌లోనే ‘హలో’ తీశాడు. ఈ చిత్రం నటునిగా అఖిల్‌కి కాస్త మెప్పును, పాజిటివ్ టాక్‌ని అందించినా కమర్షియల్‌గా హిట్‌ని అందించడంలో విఫలం అయింది. ‘హలో’ చిత్రాన్ని అఖిల్‌కి రీలాంచ్ అని ప్రకటించాడు. కానీ అది ఆ కల నెరవేర్చలేదు.
ఇక ‘తొలిప్రేమ’తో యంగ్ జనరేషన్‌ని మెప్పించిన వెంకీ అట్లూరితో అఖిల్ చేసిన మూడో రీలాంఛ్ ‘మిస్టర్ మజ్ను’ కూడా దెబ్బతీసింది. దాంతో కథ మరలా మొదటికి వచ్చింది. ఇదే సమయంలో నాగార్జున అఖిల్ తదుపరి చిత్రాన్ని ఫామ్‌లోలేని శ్రీనువైట్ల చేతిలో పెట్టాడనే వార్తలు బయటకు రాగానే మీడియాతో పాటు అభిమానులు కూడా ఖంగుతిన్నారు. కానీ నాగ్ అఖిల్ నాలుగో చిత్రం కోసం మరో ఇంటెలిజెంట్, సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న క్రిష్ చేతిలో పెట్టాడని సమాచారం. ఇదే నిజమైతే నాగ్ నిర్ణయం అక్షరాల మంచిదేనని చెప్పాలి.
ఏదో ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ ఫ్లాప్‌ని క్రిష్‌కి పూర్తిగా అంటగట్టడం సరికాదు. ఇందులో బాలయ్య ప్రమేయం ఎక్కువని, బాలయ్య కనుసన్నల్లో ఆయన చెప్పిన విధంగానే క్రిష్ తీశాడు తప్ప నిజానికి క్రిష్‌కి పూర్తి స్వేచ్చని ఇచ్చి ఉంటే ఇందులో ఎమోషన్స్ మరింతగా మెప్పించేవనేది నిజం. కాబట్టి క్రిష్ టాలెంట్‌ని కేవలం ‘కథానాయకుడు’తో ముడిపెట్టకూడదు. ఇక ఈ చిత్రం ప్రారంభం అయ్యేలోపు అఖిల్ విదేశీ ట్రిప్‌కి వెళ్తాడట. క్రిష్ దర్శకత్వంలో అఖిల్ నటించే చిత్రాన్ని నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియోస్’ బేనర్‌తో పాటు క్రిష్-రాజీవ్‌రెడ్డిల భాగస్వామ్యంలో రూపొందనుందని సమాచారం.