ప్రస్తుతం టాలీవుడ్‌లో రచయితల కొరత ఎక్కువగా ఉంది. దీనికి కారణం ఒకనాడు పరుచూరి బ్రదర్స్, సత్యానంద్‌లతో పాటు ఎందరో అడపాదడపా తమ సొంత డైరెక్షన్‌లో చిత్రాలు చేసినప్పటికీ బయటి చిత్రాలకు స్టార్ రైటర్స్‌గా పనిచేస్తూనే ఉండేవారు. కానీ నేడు ఈ రచయితలు మాత్రం దర్శకులు, నటీనటులుగా మారి కేవలం తమ దర్శకత్వంలోని చిత్రాలకే పరిమితం అవుతున్నారు.
ఇక విషయానికి వస్తే రచయితగా సతీష్ వేగేశ్నకి మంచి పేరుంది. మంచి హ్యూమన్ ఎమోషన్స్, కామెడీ చిత్రాలకు ఆయన రచయితగా పనిచేశాడు. ‘మాపెళ్లికి రండి, తొట్టిగ్యాంగ్, కబడ్డీ.. కబడ్డీ, నా ఆటోగ్రాఫ్, బ్లేడ్‌బాబ్జీ, గబ్బర్‌సింగ్, రామయ్య వస్తావయ్యా, సుబ్రహ్మణ్యం ఫర్‌సేల్’ చిత్రాలతో తన సత్తా చాటాడు. ఇక ఈయన దర్శకునిగా మారి ‘దొంగలబండి, రామదండు, కులుమనాలి’ వంటి చిత్రాలు తీసినా విజయం సాధించలేకపోయాడు. ఎట్టకేలకు దిల్‌రాజుని మెప్పించి, శర్వానంద్‌తో గర్వించదగ్గ చిత్రంగా అవార్డులు, రివార్డులు సాధించిన ‘శతమానం భవతి’తో సంచలనం సృష్టించాడు.
ఆ తర్వాత మరోసారి దిల్‌రాజుతోనే నితిన్ హీరోగా ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రం చేస్తే అది డిజాస్టర్ అయింది. ఇక ఈయన మాస్ చిత్రాల కంటే ఎమోషన్స్ ట్రెడిషననల్, కామెడీ చిత్రాలతోనే బాగా మెప్పిస్తాడనే పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన దర్శకత్వంలో మరో చిత్రం రూపొందనుంది. టాలెంట్ ఉన్నా కూడా సరైన హిట్స్ కొట్టలేకపోతోన్న హీరో నాగశౌర్యతో ఆదిత్యా మూవీస్ నిర్మాణంలో ‘ఆల్ ఈజ్ వెల్’ అనే చిత్రం చేయనున్నాడు. టైటిల్‌తోనే మంచి ఫీల్‌గుడ్ మూవీ అనిపిస్తోన్న ఈ చిత్రం దర్శకుడు సతీష్ వేగేశ్న, హీరో నాగశౌర్య, ఆదిత్యా మూవీస్ వంటి వారికి ఇది కీలకం కానుంది.