తెలుగులో రైటర్ కమ్ డైరెక్టర్‌గా మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయనతో చిత్రం చేయాలని ఎందరో హీరోలు ఎదురుచూస్తుంటారు. కానీ దర్శకునిగా ఆయన తరుణ్, మహేష్, పవన్‌కళ్యాణ్, అల్లుఅర్జున్, జూనియర్ ఎన్టీఆర్ మధ్యలో నితిన్ వంటి వారితో చిత్రాలు చేశాడు. ముఖ్యంగా పవన్ అల్లుఅర్జున్ వంటి మెగాఫ్యామిలీ హీరోలతో వరుస చిత్రాలు చేస్తున్నాడు. త్వరలో ఈయన సీనియర్ స్టార్స్ అయిన వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవిలతో చిత్రాలు చేయడం ఖాయం. ఇదే విషయాన్ని చిరంజీవి, వెంకటేష్‌లు బహిరంగంగానే ప్రకటించారు.
త్రివిక్రమ్ చిత్రాలు అంటే ఖచ్చితంగా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి ఎమోషన్స్ ఉంటాయి. ‘అతడు’లో మహేష్-నాజర్, జులాయిలో తనికెళ్లభరణి-అల్లుఅర్జున్, ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ప్రకాష్‌రాజ్-అల్లుఅర్జున్, ‘అత్తారింటికి దారేది’లో పవన్-నదియ.. ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. ఇక త్రివిక్రమ్‌లో ఉండే గుణం ఏమిటంటే... తన చిత్రాలలో కొన్ని పవర్‌ఫుల్‌గా ఉండే కీలకమైన పాత్రలను సృష్టిస్తాడు. ‘అత్తారింటికి దారేది’లో నదియా, బొమ్మన్ ఇరాని, ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ప్రకాష్‌రాజ్, ఉపేంద్ర, ‘అజ్ఞాతవాసి’లో ఖుష్బూ.. ఇలా ఎన్నో ఉదాహరణగా నిలుస్తాయి.
ఇక విషయానికి వస్తే ‘నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా’ డిజాస్టర్ తర్వాత అల్లుఅర్జున్ ఏకంగా ఎనిమిది నెలలు గ్యాప్ ఇచ్చాడు. త్రివిక్రమ్ ‘అజ్ఞాతవాసి’ ద్వారా తీవ్ర విమర్శలు ఎదుర్కొని ‘అరవింద సమేత వీరరాఘవ’ ద్వారా మరలా ట్రాక్‌లోకి వచ్చాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో త్రివిక్రమ్-బన్నీల కాంబినేషన్‌లో ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ల తర్వాత హ్యాట్రిక్ మూవీ రూపొందనుంది. ఇందులో ఎప్పుడు అబద్దాలు చెప్పే వ్యక్తి వాటిని తన తండ్రి కోసం నిజం చేసే పాయింట్‌తో రూపొందుతోందని అంటున్నారు.
అంటే ‘జులాయి’లో తండ్రి తనికెళ్లభరణి, ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ప్రకాష్‌రాజ్‌లానే ఈ కొత్త చిత్రంలో హీరో తండ్రి పాత్ర ఎంతో కీలకంగా, ఫాదర్ సెంటిమెంట్‌తోనే ఉంటుందని సమాచారం. అంతేకాదు, నదియా, ఖుష్బూల తరహాలోనే మరో సీనియర్ నటి కూడా ఉంటుందని, మరి హీరో తండ్రితో పాటు సీనియర్ హీరోయిన్ పాత్రలకు త్రివిక్రమ్ ఎవరిని ఎంచుకుంటాడో వేచిచూడాల్సివుంది..!