సడన్ గా సన్నీలియోన్ ను కాషాయ వస్త్రాల్లో చూస్తే ఏమనిపిస్తుంది? ఏముందిలో ఏదైనా సెక్సీ లేడీ స్వామి పాత్ర పోషిస్తుందేమో అనుకుంటారు జనాలు. ఎందుకంటే ఆమెకున్న ఇమేజ్ అలాంటిది. ఒకవేళ స్వయంగా సన్నీలియోన్ ఈ సినిమాలో హాట్ సీన్స్ ఏమీ ఉండవు, నేను కేవలం ప్రవచనాలు చెబుతాని అని చెప్పినా కూడా థియేటర్లో ఒక్కసారైనా చూసి కానీ ఆ మాటల్ని నమ్మరు జనాలు. ఒక నటుడు లేదా నటీమణికి ఒక ఇమేజ్ వచ్చేశాక ఆ ఇమేజ్ ను పక్కనపెట్టి వేరే ఏదైనా పాత్ర చేస్తే అంత త్వరగా యాక్సెప్ట్ చేయలేరు జనాలు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు అంటే.. నిన్నమొన్నటివరకూ క్రూరమైన లేదా స్టైలిష్ విలన్ గా కనిపించిన శ్రవణ్ రాఘవేంద్ర ఇప్పుడు ఎదురీత అనే కాన్సెప్ట్ బేస్డ్ క్లాస్ ఫిలిమ్ లో లీడ్ రోల్ ప్లే చేస్తూ ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు.
ఈ ప్రపంచంలో తనకంటూ ఉన్న ఏకైక బంధం అయిన తన కుమారుడు ఏం అడిగినా కాదనకుండా ఇచ్చే తండ్రి.. అలా కొడుకు అడిగిందల్లా ఇవ్వడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది అనేది సినిమా కథాంశం. తండ్రీకొడుకుల అనుబంధం నేపధ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది కానీ.. ఆ పోస్టర్ లోని నటుడ్ని శ్రవణ్ రాఘవేంద్ర అని గుర్తించడానికి జనాలకి చాలా టైమ్ పట్టింది.
శ్రవణ్ కంటే ముందు అతడి టీం మేట్స్ అయిన అజయ్ వంటివారు హీరోలుగా తమ లక్ ను టెస్ట్ చేసుకొని సఫలీకృతులవ్వలేక మళ్ళీ విలన్స్ గానే కంటిన్యూ అయ్యారు. మరి శ్రవణ్ కూడా అదే తరహాలో ఫెయిల్ అవుతాడా లేక ప్రేక్షకులు అతడ్ని ఆదరిస్తారా అనేది చూడాలి.