మంచి సినిమాలు వేరు.. కమర్షియల్ హిట్స్ వేరు అనేది జగమెరిగిన సత్యం. షకీలా, సన్నిలియోన్‌లు నటించే చిత్రాలు అతి తక్కువ బడ్జెట్‌లో సాఫ్ట్‌పోర్న్ చిత్రాలుగా రూపొంది, పెట్టుబడికి పదింతలు లాభాలు తీసుకుని రావచ్చు. గతంలో షకీలా చిత్రాలు దానిని నిరూపించాయి. షకీలా చిత్రం విడుదల అవుతోందంటే మలయాళ స్టార్స్ కూడా తమ చిత్రాల రిలీజ్ డేట్స్‌ని మార్చుకునేవారు. కానీ కె.విశ్వనాథ్ వంటి వారు తీసే కళాత్మక చిత్రాలు కమర్షియల్‌గా పెద్దగా ఆడనంత మాత్రాన వాటికంటే షకీలా చిత్రమే బాగుందని, మంచి చిత్రమని అనుకోకూడదు.
ఇక సోషల్ మీడియా విస్తారం అయిన తర్వాత సినిమాలపై విమర్శకుల అభిప్రాయాలు, పాజిటివ్ రివ్యూలు, రేటింగ్‌లపై ఇండస్ట్రీ పెద్దలు మండిపడుతున్నారు. కానీ రివ్యూలు, పాజిటివ్ టాక్, రివ్యూల రేటింగ్స్ కొత్తదనం, సినిమాని ఎంత బాగా తీశారనే పాయింట్ మీదనే ఇస్తారని, అది సాధించబోయే కలెక్షన్లు, టాక్‌కి సంబంధం ఉండదనేది వాస్తవం. ఇక తాజాగా ఈ విషయం మరోసారి రుజువైంది.
ఎన్టీఆర్ బయోపిక్ మొదటి పార్ట్ ‘కథానాయకుడు’కి పాజిటివ్ టాక్, మంచి రివ్యూలు, రేటింగ్స్ వచ్చాయి. అదే ‘వినయ విధేయ రామ’కి బ్యాడ్ ఫీడ్‌బ్యాక్, పూర్ రేటింగ్స్‌లు, తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ‘వినయ విధేయ రామ’ టాక్, రివ్యూలతో సంబంధం లేకుండా 60కోట్లు రాబట్టింది. నష్టం కేవలం 30 కోట్లకి అటు ఇటుగా వచ్చింది. ‘కథానాయకుడు’కి మంచి రివ్యూలు వచ్చినా 70కోట్లకు గాను 20కోట్లు కష్టపడి వచ్చాయి. 50కోట్ల నష్టం వచ్చింది. మరి దీనిని బట్టి విషయం స్పష్టంగా అర్ధమవుతోంది.
‘కథానాయకుడు’ విషయానికి వస్తే ఈ చిత్ర నిర్మాణ భాగస్వాములలో వారాహిచలన చిత్రం అధినేత సాయికొర్రపాటి ఒకరు. ఇటీవలే ‘కేజీఎఫ్’ ద్వారా ఈయనకు మంచి లాభాలు వచ్చాయి ‘కథానాయకుడు’కి భారీస్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ జరగడంతో విడుదలకు ముందే దాదాపు 5కోట్ల లాభం తన వంతుగా వచ్చింది. దీనికితోడు ‘కథానాయకుడు’ బాగా ఆడుతుందని, ఫలితంగా మరిన్ని లాభాలు వస్తాయని భావించిన ఆయన ఈ మూవీని రెండు ఏరియాలలో విడుదల చేశాడు.దీనివల్ల ఆయనకు 8కోట్ల నష్టం వచ్చింది.
అంటే లాభం పోను ఈయనకు ఫైనల్‌గా మూడు కోట్ల నష్టం వచ్చింది. దాంతో ‘మహానాయకుడు’ని ఉచితంగా ఇస్తుండటంతో దాని ద్వారా అయినా తన నష్టాలు పూడుతాయనే ఆశతో సాయికొర్రపాటి ఉన్నాడు.