ప్రేమకథా చిత్రాలు తీయడంలోనూ, కొత్త నటీనటులను ప్రోత్సహించడంలోనూ తేజకి ఓ శైలి ఉంది. ఆయన దర్శకునిగా పనిచేసిన తర్వాత వరుస బ్లాక్‌బస్టర్స్ ఇచ్చి చిన్న బడ్జెట్ చిత్రాలతో కూడా పెద్ద హిట్స్ కొట్టడం ఎలాగో పలువురికి తెలియపరిచాడు. అలాంటి తేజ ఆ తర్వాత ఎంతో కాలం హిట్స్‌లేక నానా తిప్పలు పడ్డాడు. పూరీ టైప్‌లోనే ఆయన ఒకే పంథాలో సాగుతూ రావడం మైనస్ అయింది. అలాంటి సమయంలో ఆయన ‘నేనే రాజు-నేనేమంత్రి’ అనే పొలిటికల్, ఎమోషనల్ థ్రిల్లర్ ద్వారా తక్కువ పెట్టుబడితో రానాకి ఉన్న మార్కెట్‌ని సద్వినియోగం చేసుకుని ఫామ్‌లోకి వచ్చాడు. అయినా ఆ చిత్రంలో కూడా ఎన్నో మైనస్‌లు ఉన్నాయి. కానీ అవి చాలా మైనర్.
నిజానికి ‘నేనే రాజు-నేనేమంత్రి’ చిత్రాన్ని మొదట రాజశేఖర్‌తో ప్రారంభించి, దాదాపు సినిమా షూటింగ్ పూర్తయిన తరుణంలో క్లైమాక్స్ ఇతర విషయాలలో ఇద్దరి మధ్య స్పర్ధలు రావడంతో తీసిన చిత్రాన్ని పక్కనపెట్టి అదే కథను రానాతో తీసి తన పంతం ఏమిటో చూపించాడు. ఇక ఎన్టీఆర్ బయోపిక్ వంటి మహదవకాశం వచ్చినా బాలయ్యతో సరిపడక గుడ్‌బై చెప్పాడు. నిజానికి తేజ ‘కథానాయకుడు’లో స్వర్గీయ ఎన్టీఆర్ వేసిన పలు గెటప్స్, ఇతర వాటి వల్ల సినిమా ఫీల్ తగ్గుతుందని భావించాడు. చివరకు అదే నిజమైంది.
ఇక ‘నేనేరాజు నేనేమంత్రి’ని రాజశేఖర్ నుంచి రానాకి మరలించిన తేజ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌తో పాటు తను పరిచయం చేసి అచ్చివచ్చిన కాజల్‌ని కలిపి ‘సీత’ చిత్రం తీస్తున్నాడు. వాస్తవానికి ఈ చిత్రం కంటే ముందే తేజ వెంకటేష్‌తో ‘సావిత్రి’ అనే చిత్రం చేయనున్నాడని వార్తలు వచ్చాయి. అది కూడా సురేష్ ప్రొడక్షన్స్ బేనర్‌లోనే తీస్తాడని అన్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. కథ విషయంలో వెంకటేష్, సురేష్‌బాబులకు అనుమానాలు ఉండటం, పలు మార్పులు చేర్పులు చేయమనడంతో దానికి బై చెప్పాడని, అదే కథను బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్‌ల జోడీకి అనుగుణంగా మార్పులు చేశాడని సమాచారం.
వెంకీతో ‘సావిత్రి’ కథను భార్యాభర్తల మధ్య జరిగే ఎమోషన్స్, ఇతర అంశాలతో తయారు చేసిన తేజ.. ‘సీత’ విషయంలో దానిని ప్రేమికుల మద్య కెమిస్ట్రీగా మార్చాడని సమాచారం. అయితే ‘సీత’ అనే టైటిల్ కాజల్ అగర్వాల్‌దా? లేక గతంలో ‘లక్ష్మీ, తులసి’ తరహాలో హీరో పేరా? అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. మరి ఈ చిత్రం తేజాకి ఎలాంటి ఫలితం ఇస్తుందో వేచిచూడాల్సివుంది.