‘మిస్టర్ మజ్ను’ క్యారెక్టర్‌ను అఖిల్ నా ఊహకు మించి అద్భుతంగా చేశారు: వెంకీ అట్లూరి
తొలి చిత్రం ‘తొలిప్రేమ’తో సూపర్‌హిట్ సాధించిన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని కథానాయకుడుగా తెరకెక్కిన రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై భారీ నిర్మాత బివిఎస్‌ఎన్.ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై.. హిట్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి ఇంటర్వ్యూ..
‘తొలిప్రేమ’తో తొలి హిట్ కొట్టారు.. ‘మిస్టర్ మజ్ను’తో మలి హిట్ కొట్టారు. దీనిపై మీ స్పందనేంటి?
- చాలా హ్యాపీగా ఉంది. తొలి ఆట ఖతార్‌లో పడింది. అక్కడ బాగుందని టాక్ రావడంతో నాకు రిలాక్స్‌డ్‌గా అనిపించింది. ఓకే.. నేను వెళ్లి సినిమా చూడొచ్చుననిపించింది. క్లారిటీ వచ్చిన తర్వాత ఆడియెన్స్ కేరింతల మధ్య మెయిన్ థియేటర్‌లో సినిమా చూశాను. చాలా బాగా అనిపించింది.
రియల్ లైఫ్‌లో మీరే మిస్టర్ మజ్ను అని అఖిల్ అన్నారుగా..?
- ఆయన చెప్పినట్లు అలా ఉండాలనుకుంటున్నాననే కానీ, నేను అలా లేనుగా. అలా ఉండలేం. అలాంటి లార్జర్ దేన్ లైఫ్, అలాంటి ధైర్యం నాకు లేదు.
ఈ కథకు ఇన్‌స్పిరేషన్ ఏంటి?
- ‘ప్రేమనగర్’లోని నాగేశ్వరరావుగారిలోని ఓ క్యూని బేస్ చేసుకుని అఖిల్ క్యారెక్టర్‌ను డిజైన్ చేసుకున్నాను.
మజ్ను అంటే శాడ్ ఎండింగ్ ఉంటాయి. కానీ ‘మిస్టర్ మజ్ను’లో ప్లేబోయ్ క్యారెక్టర్‌ను ఎందుకు డిజైన్ చేశారు?
- మజ్ను అంటే చామర్.. పొయెట్. ఆయన జీవితం చివరకు విషాదంతో ముగిసింది. కానీ మన సినిమా విషయానికి వచ్చేసరికి అఖిల్ ప్లే చేసిన విక్కీ క్యారెక్టర్ కూడా చామర్. పాత్రలో చిన్ననాటి పాత్రని యాడ్ చేయడానికి, విషాదంగా ఉండదు అని చెప్పడానికే టైటిల్ ముందు మిస్టర్ అని ఫిక్స్ చేశాం.
ఈ సినిమా చేయడానికి అఖిల్ కోసం చాలా రోజులు వెయిట్ చేశారుగా?
- అలా కుదిరింది. అఖిల్ రెండు సినిమాలతో బిజీగా ఉండటం.. నేను కూడా ‘తొలిప్రేమ’తో బిజీగా ఉండటం.. అలా ఇద్దరికీ కుదిరింది. తొందరగానే, సినిమాను ట్రాక్ ఎక్కించాం. నిజం చెప్పాలంటే ఇద్దరం ఎక్కువగా వెయిట్ చేయలేదు. ప్రకృతి అలా మాకు సపోర్ట్ చేసిందని అనుకుంటున్నాను.
మిమ్మల్ని నమ్మి ఈ సినిమాలో మీతో ట్రావెల్ చేసిన వారు సినిమా రిలీజ్ తర్వాత ఏమన్నారు?
- నన్ను నమ్మిన వాళ్లలో అఖిల్, ప్రసాద్‌గారు.. అలాగే టీంలో థమన్, జార్జ్ అందరూ సినిమాను నమ్మారు. నాగార్జునగారు ఈ సినిమాకు తొలి ఆడియన్. ఆయన కథ విన్న తర్వాత మళ్లీ ఎప్పుడూ సినిమా గురించి ఏమీ అడగలేదు. సినిమా పూర్తైన తర్వాత ఆయన సినిమా చూపించమని అన్నారు. చూసిన తర్వాత రిలాక్స్‌గా ముందుకెళ్ళండి అని అన్నారాయన. ఓ పబ్ సీన్‌ను రీషూట్ చేయమని సలహా ఇచ్చారు. ఆయన సలహా సినిమాకు ఎంతో హెల్ప్ అయ్యింది.
దిల్‌రాజు మనవడుతో కొండబాబు కామెడీ ట్రాక్ ఐడియా ఎవరిది?
- నాదే.. నాకు దిల్‌రాజుగారి ఫ్యామిలీ చాలా క్లోజ్. ఆయన మనవడు ఆరాన్ష్.. ఏడాదిన్నర వయసు. చాలా యాక్టివ్. తనను అబ్వర్జ్ చేసిన తర్వాత తనైతే సూట్ అవుతాడని దిల్‌రాజుగారిని అడిగాను. ఆర్ యు ష్యూర్ అన్నారు. అలాగే దిల్‌రాజుగారి అమ్మాయిని కూడా అడిగాను. ఆమె కూడా ఒప్పుకోవడంతో ఆరాన్ష్‌ను కొండబాబు క్యారెక్టర్‌కు తీసుకున్నాను. తను నా అంచనాలకు తగ్గట్టు రీచ్ అయ్యాడు. తను సెకండ్ టేక్ తీసుకోలేదు.
అక్కినేని హార్డ్‌కోర్ ఫ్యాన్ కదా.. నాగార్జున కోసం కథేమైనా రెడీ చేశారా?
- ప్రత్యేకంగా ఇంకా ఆయన కోసం కథలేం రాయలేదు కానీ.. అక్కినేని అభిమానిగా నాగార్జునగారు నటించిన గీతాంజలి, శివ, అన్నమయ్య సినిమాలను బాగా ఇష్టపడతాను.
పైరసీ సీన్‌ను ఎందుకు యాడ్ చేశారు?
- ఒక సినిమా కోసం ప్రతి ఒక్కరం చాలా కష్టపడతాం. నిద్ర కూడా సరిగ్గాపోము. ఇంత కష్టపడి సినిమా తీస్తే.. పొద్దున మూడు గంటలకు ఓ లింక్‌లో సినిమా చూసేయమని ఉంటుంది. ఇది బాధగానే ఉంటుంది. అదెప్పుడూ మనసుకి చివ్వుక్కున అనిపించే అంశమే. దాన్ని సీరియస్‌గా కాకుండా కామెడీ యాంగిల్‌లో చూపిస్తామని చేసిందే.
మీలోని యాక్టర్, డైరెక్టర్‌లో ఎవరంటే ఇష్టపడతారు?
- నేను నేచురల్ యాక్టర్‌ని కాను. స్నేహగీతంకు డైలాగ్స్ రాసేటప్పుడు ఒక్కొక్క సీన్‌కు ఆరేడు వెర్షన్స్ డైలాగ్స్ రాసినా నాకు ఇబ్బంది అనిపించలేదు. అయితే యాక్టర్‌గా సెకండ్ టేక్‌కు వెళ్లగానే.. తలనొప్పిగా అనిపించేది. కంఫర్ట్‌గా అనిపించలేదు. రైటర్‌గా స్టార్ట్ చేసిన తర్వాత డైరెక్టర్‌గా మారాను.
రైటర్, డైరెక్టర్‌గా మీకు ఎవరంటే ఇష్టం?
- త్రివిక్రమ్‌గారంటే ఎక్కువ ఇష్టం. అలాగే మణిరత్నంగారు కూడా ఇన్‌స్పిరేషన్. మణిరత్నంగారి సినిమాలు హెవీగా ఉండవు. సింపుల్‌గా ఉంటాయి. అలాగే త్రివిక్రమ్‌గారు రైటర్‌గా రైటింగ్‌ను సింప్లిఫై చేసేశారు. ఆయన ఇన్‌స్పిరేషన్‌తోనే సినిమాలకు రైటింగ్ చేయడం స్టార్ట్ చేశాను.
మీ మజ్ను క్యారెక్టర్‌కి అఖిల్ ఎంత వరకు న్యాయం చేశాడని అనుకుంటున్నారు?
- నేను అనుకున్న దాని కన్నా 50 శాతం ఎక్కువే చేశాడని అనుకుంటున్నాను. తనకెప్పుడూ ఇలా చేయాలని నేనెప్పుడూ చెప్పలేదు. తను సీన్‌లో ఎమోషన్ ఏంటి? అని అడిగి దాని ప్రకారం చేసుకుంటూ వెళ్లిపోయేవాడు. తన నటన నా ఊహ కన్నా ఓ స్టెప్ బాగానే ఉండేది.
నిధి పెర్ఫామెన్స్ గురించి?
- నిధి అగర్వాల్‌తో పనిచేసేటప్పుడు నాకు అంత కష్టమనిపించలేదు. ఆమె అమ్మమ్మగారిది హైదరాబాదే. అలాగే అప్పటికే ఆమె సవ్యసాచిలో నటించింది. తెలుగు అర్థం చేసుకునేది. ఎక్కడా తను డైలాగ్ మీద ఫోకస్ పెట్టి ఎక్స్‌ప్రెషన్‌ను మిస్ చేయలేదు. నిజంగా ఫీలై చేసినట్టే చేసింది.
రావు రమేష్ కొడుకు క్యారెక్టర్‌లో కొత్త నటుడిని ఎందుకు తీసుకున్నారు?
- మా ఫ్రెండ్ వాళ్ల ద్వారా కొత్త నటుడు నన్ను అప్రోచ్ అయ్యారు. ముందు ఫోటోలను పంపారు. అఖిల్‌కి బ్రదర్ క్యారెక్టర్ అనగానే.. పాత్రకు తగినట్లు ఫేస్‌లో రిచ్ లుక్, కన్నింగ్ నెస్ కనపడింది. తన సూట్ అవుతాడనిపించి ఓకే చేశాను.
థమన్ సంగీతం సక్సెస్‌లో ఎంత కీలకంగా మారింది?
- థమన్ ‘తొలిప్రేమ’ సమయంలో ఎంత న్యాయం చేశాడో, ఈ సినిమాకు కూడా అంతే న్యాయం చేశాడు. సాంగ్స్ అద్భుతంగా ఇచ్చాడు. బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సీన్స్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లాడు.
నిర్మాతలు బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, బాపినీడుతో రెండో సినిమా చేయడం ఎలా అనిపించింది?
- బాపినీడుతో నేను రైటర్ కాక ముందు నుంచి పరిచయం ఉంది. తొలిప్రేమ నుంచి నాకు బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్‌గారితో పరిచయమైంది. ఇప్పుడు బాపి కంటే ప్రసాద్‌గారితోనే మంచి అనుబంధం ఉంది.
శ్రీమణి, జార్జ్ గురించి?
జార్జ్, శ్రీమణి ఎవరైనా నాకు కంఫర్ట్‌గా అనిపించారు. తొలిప్రేమకు కూడా శ్రీమణి అన్ని పాటలను రాశారు. జార్జ్‌తో కూడా మంచి స్నేహం ఉంది. తను ఫ్రేమ్ పెడితే ఇంత అందంగా పెట్టాడేంటి? అనేంత బాగా ఉంటుంది. తనతో కూడా తొలిప్రేమ ముందు నుండే పరిచయం ఉంది. నా టీంకు నాకు ఏం కావాలో, ఎలాంటి ఔట్‌పుట్ ఇవ్వాలో వాళ్లకు బాగా తెలుసు.
ఎన్టీఆర్‌తో సినిమా ఎప్పుడు ఉంటుంది?
- ఆయనతో తప్పకుండా సినిమా చేయాలని నాకూ ఉంది. అయితే అంత పెద్ద స్ట్రేచర్ ఉన్న నటుడితో సినిమా అంటే అన్ని ఎలిమెంట్స్ పక్కాగా కుదరాలి. మంచి కథ కుదరాలి. ఇంకాస్త అనుభవం రావాలి. అన్నీ అమరితే ఆయనతో తప్పకుండా సినిమా చేస్తాను.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్?
- ప్రస్తుతం ‘మిస్టర్ మజ్ను’ని నెక్స్‌ట్ లెవల్‌కు తీసుకెళుతున్నాం. కొన్ని థియేటర్స్‌కు వెళ్లి అక్కడి రెస్పాన్స్‌ను చూడబోతున్నాను. తర్వాతే నెక్స్‌ట్ మూవీ గురించి ఆలోచిస్తాను. ఈ బ్యానర్‌లో సినిమా ఉంటుంది కానీ.. ఎప్పుడు ఉంటుందో ఇప్పుడే చెప్పలేను. రెండు, మూడు కథలను సిద్ధం చేస్తున్నాను. మైత్రీ మూవీస్‌లో ఓ సినిమా కమిట్‌మెంట్ ఉంది.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు డైరెక్టర్ వెంకీ అట్లూరి.