ఎందరో యువ టాలెంటెడ్ కమెడియన్లకు, అనసూయ, రష్మి వంటి వారికి కూడా ఈటీవీ ‘జబర్దస్త్’ ఇచ్చిన గుర్తింపు సామాన్యమైనది కాదు. ఇదే కోవలో పలువురు వెండితెరపై కూడా కమెడియన్లుగా సత్తా చాటుతున్నారు. తెలుగు టివి చానెల్స్‌లో ‘జబర్దస్త్’కి ఉన్న స్థానం ప్రత్యేకమైంది. ఈ షోలో ఎన్నో లోటు పాట్లు, కించపరిచే స్కిట్స్, అసభ్యకరమైనవి, కొందరి మనోభావాలను దెబ్బతీసేవి ఉన్నా కూడా కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ని కోరుకునే వారికి మాత్రం ఇది ఫుల్‌మీల్స్ వంటిదనే చెప్పాలి. ఇక ఈమధ్య చాలాకాలం ఈ షోని ఒంటి చేత్తో హైపర్ ఆది నడిపిస్తున్నాడని చెప్పడం కూడా అతిశయోక్తి కాదు. ఆయన వేసే పంచ్‌లకి నవ్వని వారు ఉండరు.
మరోవైపు ఈయనకు పలు సినీ వేడుకలలోనే కాదు.. కమెడియన్‌గా కూడా మంచి అవకాశాలు లభిస్తున్నాయి. నిన్ననే విడుదలైన ‘మిస్టర్ మజ్ను’లో కూడా ఈయన నటించాడు. ఈ రేంజ్‌లో ఆయన ఎదగడంతో ఇక భవిష్యత్తులో ఆయన మరలా జబర్దస్త్‌కి రాడేమో అనే అనుమానాలు ఏర్పడ్డాయి. దాంతో ఈ షోకి టీఆర్పీ రేటింగ్స్ కూడా తగ్గాయంటే పరిస్థితి అర్ధం అవుతుంది. కానీ మొత్తానికి హైపర్ ఆది అభిమానులకు శుభవార్త ఏమిటంటే.. ఆయన రెండు నెలల తర్వాత షోకి వచ్చి స్కిట్స్ చేస్తున్నాడు. వచ్చే వారం ప్రసారమయ్యే ఈ షోకి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమో మొత్తం హైపర్ ఆదితోనే నిండిపోయిందంటే అది ఆయనకున్న క్రేజ్‌కి నిదర్శనంగా చెప్పాలి.
ఇక వస్తూనే రోజాతో డ్యాన్స్ చేయడం, బాలకృష్ణపై, నాగబాబు వేసిన సెటైర్లపై పంచ్ పేలుస్తూ ఆకట్టుకుంటున్నాడు. పనిలో పనిగా తన వెంట అనసూయ సోదరి వైష్ణవిని కూడా తీసుకుని రావడం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. కేవలం ఈ ప్రోమోకే 24 గంటల్లో 2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. మొత్తానికి ‘జబర్దస్త్’కి మరలా ఆదితో పూర్వవైభవం రావడం ఖాయమని తేలిపోతోంది. కానీ ‘జబర్ధస్త్’ కేవలం మెగా ఫ్యామిలీని భుజానికి ఎత్తుకునే షో అనే అపవాదు మాత్రం ప్రోమోలో బాలయ్యపై నాగబాబు చేసిన వ్యాఖ్యలకు సెటైర్‌ని విసరడంతో మరింతగా బలపడే అవకాశాలు ఉన్నాయి.